పాల ఆటో–బైక్ ఢీకొని యువకుడు మృతి
నాగల్‌గిద్ద, ఆగస్టు 15 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలం గూడూరు గ్రామానికి చెందిన సాగర్ ఆంజనేయులు (తండ్రి: మాణిక్, వయసు: 21 సంవత్సరాలు) శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 7 గంటల సమయంలో సాగర్ ఆంజనేయులు ఓ ఉపాధ్యాయురాలిని బైక్‌పై గూడూరు నుంచి నాగల్‌గిద్దకు తీసుకువచ్చి అక్కడ దింపాడు. అనంతరం తిరిగి బైక్‌పై గూడూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో గూడూరు బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న పాల ఆటో, బైక్ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాగర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదం జరిగిన విషయం ఉదయం 7:30 గంటలకు నాగల్‌గిద్ద పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ రవీందర్ వెంటనే సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాల ఆటోను గూడూరు గ్రామానికి చెందిన మాలేగావ్ విజయ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్ఐ రవీందర్ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడి మృతితో గూడూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






