ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు10 (విజయ క్రాంతి):ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆక్రమణలను వెంటనే తొలగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం డి మాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కాగజ్నగర్ మండలం కోసిని గ్రామ శివారులో సంకల్ప్ గ్రీన్ సిటీ పేరుతో 85/3, 86/3, 87/3 సర్వే నంబర్లలో లేఅవుట్కు అనుమతులు తీసుకుని, సర్వే నంబర్లు 79, 80లోని సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. ఈ భూమి విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా మున్సిపాలిటీకి చెందిన 216, 217, 218 సర్వే నంబర్లలోని భూమిని కూడా ఆక్రమించినట్లు ఆరోపించారు. శిశుమందిర్కు చెందిన భూమి సైతం ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు.అనుమతులు ఒకచోట తీసుకుని, హద్దులు మార్చి ప్రభుత్వ భూములను కలుపుకుని వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్తులో ప్లాట్లు కొనుగోలు చేసే అమాయక ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, రాష్ట్ర నాయకులు విజయ్, మురళి, విశాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






