పంట డబ్బులు తక్షణమే చెల్లించాలి
తహసీల్దార్ కు వినతి పత్రం అందిస్తున్న ఆర్సీఎస్
గుండాల, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతు కూలీ సంఘం (ఆర్సీఎస్) ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకాళ్ళ సమ్మన్న మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న, మిర్చి ప్రభుత్వం కొనుగోలు చేసిందని, కానీ పంట డబ్బులు నేటికీ రైతు ఖాతాలో జమ కాలేదని తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్) డిమాండ్ చేస్తుందన్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నదని, రైతులకు, కౌలు రైతులకు, కూలీలకు ప్రభుత్వం నూతన పంట రుణాలను మంజూరు చేయాలని, కేంద్రంలోని బీజేపీ మోధీ సర్కార్ రైతాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు తెర తీయబోతుందని ఆరోపించారు. రైతు గోసరిళ్లిన రాజ్యం -ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఏనాడు కొనసాగాదని, మోధీ పాలనలో రైతు తన భూమిలో తనే కూలీగా జీవించే రోజులు రావడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వ్యవసాయరంగం పోరాటాల ద్వారానే రక్షించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్ టీయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల అంజయ్య, రైతు కూలీ సంఘం నాయకులు రేగా రాములు, సత్తయ్య, రాంమూర్తి, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






