ఇతర రాష్ట్రాల పంట.. ఇక్కడ విక్రయం
- మధ్యదళారులు, వ్యాపారస్తులదే హవా...
- జొన్న పంట అమ్మటానికి నిరక్షిస్తున్న రైతులు...
- రైతుల పంటలను ముందుగా కొనుగోలు చేయాలన్న బీజేపీ నాయకుల డిమాండ్
ఆదిలాబాద్/ఉట్నూర్, మే 25 (విజయ క్రాంతి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకున్నందుకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు.జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జొన్నల కొనుగోళ్లలో అక్కడక్కడ అవకతవకలు జరుగుతున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల పేరుతో మధ్య దళారులు, వ్యాపారస్తులే జొన్నలను విక్రయిస్తూన్న అడ్డుకట్ట వేయలేకపోవడంతో అన్నదాతలు నష్టపోతున్నారు.
ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ కొనుగోలు చేస్తున్న జొన్న పంటలను తూకం వేసేందుకు వ్యాపారులకే ప్రాధాన్యత ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ యార్డులో జొన్న పంటలు కొనుగోలుకు వ్యవసాయ శాఖ, మార్కెట్ శాఖ అధికారులు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా గ్రామాల వారిగా రైతుల నుండి జొన్న పంట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం రోజున మామిడి గూడ, మల్లాపూర్, ఇంద్రవెల్లి (కే), భూర్సన్ పాటర్ గ్రామాల రైతులు తీసుకువచ్చే జొన్న పంటను కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం నాలుగు గ్రామాల నుండి రైతులు మార్కెట్ యార్డులో జొన్న పంటలు అమ్ముకునేందుకు తీసుకువచ్చారు. నాలుగు గ్రామాల నుండి వచ్చిన రైతుల ముందే రైతుల పేరుతో వ్యాపారులు తీసుకొచ్చిన జొన్న పంటలను కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్ అధికారులతో పాటు మార్కెట్ శాఖ అధికారులు సైతం వ్యాపారులను ప్రోత్సహించినట్లు రైతులు వాపోయారు.
తమ కండ్ల ముందే వాహనాలను తీసుకొని జొన్న పంటలు తీసుకువస్తే వాటిని కొనుగోలు చేశారు తప్ప ఆదివారం వచ్చిన రైతుల పంటలను నేటికి తూకం వేయలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తనే పక్షాన మాట్లాడేవారే కరువయ్యారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గ్రామాల వారిగా జొన్న పంటలను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వ్యాపారుల పంటను కొనుగోలు చేస్తున్నారు: సేద్మకి భీమ్ రావు, రైతు, మామిడి గూడ,
రబ్బీ సీజన్ లో సాగు చేసిన జొన్న పంట మూడు ఎకరాలలో 25 కింటల్లో దిగుబడి వచ్చింది. సోమవారం రోజున మామిడి గూడ రైతుల నుండి జొన్న పంట కొనుగోలు చేస్తామని వ్యవసాయ అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన విషయంపై మార్కెట్ యార్డులో జొన్న పంట ను ఆదివారం నాలుగు గంటలకు తీసుకోవచ్చాను. ఆదివారం తను చూస్తుండగానే వ్యాపారులు తీసుకువచ్చిన జొన్న పంటలు కొనుగోలు చేశారు.
సోమవారం ఉదయం తను తెచ్చిన పంటను తూకం వేసి కొనుగోలు చేస్తారని మధ్యాహ్నం వరకు ఎదురుచూస్తున్న తాను తీసుకువచ్చిన జొన్నలవైపు అధికారులు చూడడం లేదని అన్నారు. తాను నిల్వ ఉంచిన జొన్న పంటల పక్కనే వ్యాపారులు తీసుకువచ్చిన జొన్న పంటలను తూకం వేసి కొనుగోలు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వ్యాపారులకు, మధ్య దళారులకు పెద్దపీట వేస్తున్నారు. కొనుగోలు వరకు వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. రైతుల విషయం అధికారులు కూడ పట్టించుకోవడం లేదు.
పంట తీసుకువస్తే నిరక్షిస్తున్న: ఆత్మరామ్, రైతు, హార్కాపూర్
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం మార్కెట్ యార్డులో జొన్నలు కొనుగోలు చేస్తున్న విషయం తెలిసి తాను పండించిన పంటను తీసుకొచ్చాను. ఆదివారం నుండి పంట కొనుగోలు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని వాపోయారు. సోమవారం రెండు గంటల వరకు పంట కొనుగోలు కోసం తూకం వేసేందుకు అధికారులు హమాలీలు రాలేదు..
రైతులను తీసుకువచ్చిన పంటను కొనుగోలు చేయాలి: బీజేపీ నాయకుల డిమాండ్
ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో జొన్న పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సిడం భీమ్ రావు, ఖానాపూర్ నియోజకవర్గం కన్వీనర్ ఆరేల్లి రాజలింగు, మండల శాఖ అధ్యక్షుడు కేంద్ర బాలాజీ, నాయకుడు అర్కా కమ్ము లు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతుల పేరుతో వ్యాపారులు, మధ్యదళారులు తీసుకువచ్చిన జొన్న పంటకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. రైతులు తీసుకోవాల్సిన పంటను కొనుగోలు చేయడానికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
రైతులు తీసుకువచ్చిన పంటలను కొనుగోలు చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రైతుల వద్ద తక్కువ ధరకు తీసుకోవడంతోపాటు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసిన జొన్న పంటలను ఇక్కడి రైతుల పేర్లతో ప్రభుత్వానికి విక్రయించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ను కలిసి వాస్తవాలను వివరించి రైతులకు న్యాయం జరిగే విధంగా తమ కృషి చేస్తామని అన్నారు.






