31 July, 2026 | 1:58 PM

163 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం

28-05-2024 01:58 AM

సూర్యాపేట జిల్లాలో ముగ్గురు మిల్లర్ల అరెస్టు

సూర్యాపేట, మే 27 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయి ఉండి కోట్లాది రూపాయల ధాన్యం అమ్ముకున్న మిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా వ్యవహరించిన తిరిమలగిరికి చెందిన సంతోషి రైస్‌మిల్లు యాజయాని ఇమ్మిడి సోమనర్సయ్య, మిల్లులో వాటా కలిగి ఉన్న అతని సోదరుడు సోమయ్య, కోదాడ వెంకటేశ్వర రైస్ మిల్లు యాజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రాహుల్ హెగ్దే సోమవారం అరెస్ట్ విషయాన్ని వెల్లడించారు. 

జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోల ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. కోదాడలో శ్రీవెంకటేశ్వర రైస్‌మిల్లు, తిరుమలగిరిలోని సంతోషి రైస్‌మిల్లు, నాగారం మండలం ప్రగతినగర్‌లోని రఘరామ మిల్లుతోపాటు చివ్వెంల మండలం వల్లభాపురంలోని జగన్‌మాత రైస్‌మిల్లులో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంలో జగన్‌మాత రైస్ మిల్లు సీఎంఆర్ పెండింగ్‌కు తగిన నిల్వలు ఉన్నట్టు గుర్తించగా.. కోదాడలో వెంకటేశ్వర రైస్ మిల్లులో 2021 ఖరీప్ నుంచి వరుసగా మూడు సీజన్లకు సంబంధించి రూ.64.09 కోట్ల విలువగల 41,365 మెట్రిక్ టన్నుల ధాన్యం, తిరుమలగిరిలోని సంతోషి రైస్‌మిల్లులో రూ.91.31 కోట్ల విలువగల 41,365 మెట్రిక్ టన్నుల ధాన్యం, ప్రగతినగర్‌లో రఘురామ మిల్లులో రూ.7.71 కోట్ల విలువ గల 3,500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువలు లేనట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై రాష్ట్ర పౌరసరఫరాశాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారి ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి ముగ్గురిని వేర్వేరుగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్టు ఎస్పీ వెల్లడించారు.