31 July, 2026 | 12:49 PM

దేశాన్ని విభజించేందుకు మోదీ కుట్ర

28-05-2024 01:59 AM

పార్టీ ఎజెండాను దేశంపై రుద్దుతున్నారు

కోజికోడ్‌లో పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): దేశాన్ని విభజించేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేరళలోని కోజికోడ్‌లో ఇండియన్ యూనియన్ ముస్లీంలీగ్ ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. తన ఇష్టమైన నాయకుడు రాహుల్‌గాంధీ కేరళ నుంచి ఎన్నికల బరిలో నిలిచారని తెలిపారు. ఇండియన్ యూనియన్ ముస్లీంలీగ్ లాంటి సంస్థలు కలిసొస్తే మోదీపై పోరాడేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయటంలో కేరళ నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు.

ప్రధాని కుర్చీలో కూర్చున్న వ్యక్తి దేశంలోని అన్నివర్గాల అభివృద్ధి కోసం పనిచేయాలని, పార్టీ ఎజెండాను దేశంపై రుద్దవద్ద్దని హితవు పలికారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజలంతా ఏకమై దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో వందకు పైగా సీట్లు ఇండియా కూటమికే దక్కబోతున్నాయని తెలిపారు. బీజేపీకి గతంకంటే సగానికి తక్కువగా సీట్లు వస్తాయని చెప్పారు. కేసీఆర్‌లాగే మోదీ అనేక పొరపాట్లు చేశారని, రాజులాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.