31 July, 2026 | 3:06 PM

కేసీఆర్ కనుసన్నల్లో ఎస్‌ఐబీ

28-05-2024 01:56 AM

దాదాపు ప్రతిపక్ష నేతలందరి ఫోన్లు ట్యాప్

తలనొప్పిగా మారిన బీఆర్‌ఎస్ నేతలపైనా నిఘా

బీఎల్ సంతోష్‌ను అడ్డం పెట్టుకుని కవితను రక్షించేందుకు కేసీఆర్ యత్నం?

మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్

రేవంత్, బండి, ఈటల ఫోన్లపై నిఘా పెట్టాం

రాధాకిషన్‌రావు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి 

ఆయన వ్యతిరేకులందరి ఫోన్లు ట్యాప్ చేశాం

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన డీసీపీ రాధాకిషన్‌రావు పోలీసుల విచారణలో రహస్యాలన్నీ కక్కేశాడు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకే విపక్ష నేతలందరి ఫోన్లు ట్యాప్ చేసినట్టు వెల్లడించాడు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఎస్‌ఐబీ పనిచేసిందని చెప్పారు. బీఆర్‌ఎస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన సొంతపార్టీ నేతల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్టు తెలిపాడు. దాదాపు రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలందరి ఫోన్లు ట్యాప్‌చేసినట్టు ఒప్పుకొన్నాడు. మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తన వాగ్మూలంలో తెలిపారు. ఇప్పుడు రాధాకిషన్‌రావు వాగ్మూలం రిపోర్టు సంచలనంగా మారింది. 

హైదరాబాద్ సిటీబ్యూరో/కరీంనగర్, మే 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపాడు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ, ఎమ్మెల్సీ, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు ఆర్థిక వనరులు సమ కూర్చే సంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టా మని చెప్పాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబం..

ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బండి సంజయ్, గడ్డం వివేక్, ధర్మపురి అర్వింద్, తీన్మార్ మల్లన్న, జానారెడ్డి కుమా రుడు రఘువీర్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారా యణ, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, తీగల కృష్ణారెడ్డి, ఎన్టీవీ అధినేత నరేంద్రచౌదరి, ఆంధ్ర జ్యోతి అధినేత రాధాక్రిష్ణ, జువ్వాడి నర్సింగరావు, సరిత తిరుపతయ్య, వంశీ క్రిష్ణ ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడించాడు. ఈ నేతల వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు వెల్లడించాడు. బీఆర్‌ఎస్ పార్టీని ట్రోల్ చేసినవారిని ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు టార్గెట్ చేసినట్టు తెలిపాడు. గద్వాల, కోరుట్ల, మానకొండూ రుకు చెందిన విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు అంగీకరించాడు. 

కవితను రక్షించేందుకు భారీ ప్లాన్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్న తన కుమార్తె కవితను రక్షించుకొనేందుకు కేసీఆర్.. భారీ ప్రణా ళిక వేసినట్టు రాధాకిషన్‌రావు బయట పెట్టాడు. ప్రభుత్వంపై అసంతృప్తితో బీజేపీలో చేరాలని భావించిన బీఆర్‌ఎస్ నేత పైలెట్ రోహిత్‌రెడ్డి తదితరుల ఫోన్లు మొదట ట్యాప్ చేశారు. రోహిత్‌రెడ్డితో మాట్లాడిన మధ్యవర్తి నందు ఫోన్‌ను ట్యాప్‌చేసి ఈ వ్యవహారంలో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ పాత్ర ఉన్నదని గుర్తించారు.

రోహిత్‌రెడ్డి ఆడియోను ఆయన ముందుపెట్టి స్టింగ్ ఆపరేషన్ నడిపించారు. రోహిత్‌రెడ్డి వేసిన ప్రణాళిక ప్రకారం మొయినాబాద్ ఫాంహౌస్‌లో బీజేపీ దూతలతో చర్చలు జరిగేలా చేశారు. ఆ సమయంలో వారిని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన పాత్ర ఉన్న బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశిం చినట్టు రాధాకిష న్‌రావు ఒప్పుకొ న్నారు. సంతోష్‌ను అడ్డుపెట్టుకొని ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నుంచి తన కుమార్తె కవితను కాపాడు కోవాలని ప్లాన్ వేసినట్టు చెప్పాడు. కానీ, సంతోష్ అరెస్టు సాధ్యం కాకపోవటంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు చెప్పాడు.  

ఆర్థిక వనరులపై దాడి

ఫోన్‌ట్యాపింగ్ నిఘా రాజకీయ నాయకులకే కాకుండా రియల్‌ఎస్టేట్ రంగాలకు చెందిన పలువురు వ్యాపార వేత్తలు, బిల్డర్లు, వారి కదలికలను ట్రాక్ చేశామని రాధాకిషన్‌రావు తెలిపాడు. ప్రణీత్‌రావు బృందం ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారంగా వాట్సాప్, సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి వాటిని కూడా ట్యాప్ చేశారని, అందుకోసం ఇంటర్నెట్ ప్రొటోకాల్ డాటా రికార్డ్ (ఐపీడీఆర్)లను సమకూర్చుకున్నారని చెప్పాడు.

అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికల సమయంలో మాజీమంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఓ టీవీ ఛానల్ జర్నలిస్ట్ శ్రవణ్ అప్పటి ఎస్‌ఐబీ బాస్ ప్రభాకర్‌రావుతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించారని రాధాకిషన్‌రావు వెల్లడించాడు. శ్రవణ్ ప్రత్యర్థి పార్టీల నాయకుల ఆర్థిక మద్దతుదారుల గురించి ఎస్‌ఐబీకి సమచారం అందజేశారని, బీఆర్‌ఎస్ పార్టీని విమర్శించేవారికి వ్యతిరేకంగా ఆన్‌లైన్ ట్రోలింగ్ ప్రచారాల్లో ప్రణీత్‌రావు బృందానికి సహాయం అందించాడని తెలిపాడు. కాంగ్రెస్, బీజేపీకి ఆర్థికసాయం అందించేవారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఒప్పుకొన్నాడు. మీడియా సంస్థల అధినేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయటంపై పలువురు ముక్కున వేలేసుకొంటున్నారు.

విచారణలో వేగం పెంచిన అధికారులు

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అధికారులు ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ స్టేషన్‌కు మార్చారు. ఎస్‌ఐబీ మాజీ అధికారులు ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్న, భుజంగరావును ఈ కేసులో ఇప్పటికే అరెస్టయ్యారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావును అరెస్ట్ చేసేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీచేశారు.  

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ నా ఫోన్‌ట్యాప్ చేయించారు: జువ్వాడి

తన ఫోన్ ట్యాపింగ్‌కు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు బాధ్యులని, వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి ఫిర్యాదు చేస్తానని కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావు తెలిపారు. సోమవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్‌తో తీవ్ర అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. 

ఉమ్మడి రాష్ట్రంలో తన తండ్రి జువ్వాడి రత్నాకర్‌రావు మచ్చలేని నాయకునిగా పేరు తెచ్చుకున్నారని, నాడు కేసీఆర్ కుటుంబానికి కారులో డీజిల్ పోసుకునే స్థోమత లేదని, నేడు లక్షల కోట్లకు ఎదిగారని ధ్వజమెత్తారు. 20 ఎకరాల ఫామ్‌హౌస్ నేడు వంద ఎకరాల ఫామ్‌హౌస్ అయిందని ఆరోపించారు. తనపై పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, ఫోన్ ట్యాపింగ్‌తో తనను కట్టడి చేయడం ద్వారానే అతను ఎన్నికల్లో గెలిచాడని విమర్శించారు. 

దీనికి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీచ రాజకీయాలకు పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు బినామీలు తమ పేరుతో ఉన్న భూములను బదిలీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సినీ దంపతుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి కాపురాన్ని కూల్చేశారని విరుచుకుపడ్డారు.  

బీఆర్‌ఎస్ నేతలనూ వదల్లేదు

బీఆర్‌ఎస్ అధినాయకత్వానికి తల నొప్పిగా మారుతారు అని అనుమానం వచ్చిన సొంత పార్టీ నేతలను కూడా వదల్లేదని తేలింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విబే ధాలున్న శంభీపూర్ రాజును, కడియం శ్రీహరితో విబేధాలున్న తాటికొండ రాజయ్యను, తాండూ రు ఎమ్మెల్యేతో విబేధాలున్న పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి వారి ఫోన్లు ట్యాప్ చేసినట్టు రాధాకిషన్‌రావు బయటపెట్టాడు.