calender_icon.png 4 December, 2024 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పారిశ్రామిక పాలసీ తుదిదశకు

18-07-2024 01:02:30 AM

ఉద్యోగాలు, పెట్టుబడులే లక్ష్యంగా విధానాలు

దేశంలోనే తొలిసారిగా ఎంఎస్‌ఎంఈ పాలసీ

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం తీసుకొ స్తున్న ఆరు పారిశ్రామిక పాలసీల రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఉద్యో గాల కల్పన, పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఎంఎస్‌ఎంఈ, ఎక్స్‌పోర్టు, లైఫ్ సైన్సెస్, ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పరిశ్రమల శాఖ నూతన విధానాలను సిద్ధం చేస్తున్నట్లు సంబంధితవర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీ ప్రపంచంలోనే అత్యుత్తుమ ఇండస్ట్రీ విధానాలను అధ్యయనం చేసి ఆ నివేదికను పరిశ్రమల శాఖకు అందజేసినట్లు తెలిసింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కొత్త పాలసీలపై ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త పాలసీల రూపకల్పనకు సంబంధించి సీఐఐ, ఎఫ్‌టీసీసీఐ, ఫిక్కి లాంటి కొన్ని ఇండస్ట్రీ ఫెడరేషన్స్ నుంచి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఆ అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

పలు అంశాల ఆధారంగా పాలసీలు

సర్కారు సహకారం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, శిక్షణ, విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, అత్యున్నత స్థాయి మౌలిక వసతు లు, సుస్థిర ఆర్థికాభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏ ప్రభుత్వమైనా తమ పాలసీ లను రూపొందిస్తుంది. అయితే ఈ అంశాల్లో ప్రభుత్వాలు తమ భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కల్పించే వెసులుబాటు ల ఆధారంగా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక పాలసీని ఒక్క చట్టం రూపంలో తీసుకొచ్చింది. నాటి విధానాలకు మరింత పదునుపెట్టి పెట్టుబడులకు మరింత ఊతం ఇచ్చేలా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కొత్త పాలసీలపై ఫోకస్ పెట్టింది.

రీయింబర్స్‌మెంట్ రద్దు చేసి నేరుగా..

బీఆర్‌ఎస్ పారిశ్రామిక విధానంలో ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, విద్యుత్ సబ్సిడీ వంటి కొన్ని వెసులుబాటులను కల్పించింది. ఎంఎస్‌ఎంఈలు ఇప్పుడు జీఎస్టీ చెల్లిస్తే ఏడాది తర్వాత ఆ సొమ్మును ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. అలాగే, ఇప్పుడు కరెంట్ బిల్లును మొత్తం చెల్లిస్తే ఆ తర్వాత సబ్సిడీని చెల్లిస్తారు. అయితే ఈ బకాయిలు సకాలంలో చెల్లించడం లేదని పారిశ్రామిక ఫెడరేషన్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన బకాయిలు 2017 నుంచి రూ.3 వేల కోట్లకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఎస్‌ఎంఈలు అంటే చాలా తక్కువ మొత్తం సొమ్ముతో వ్యాపారం ప్రారంభిస్తాయని, వాటికి బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి. అందుకే రీయింబర్స్‌మెంట్ విధానాన్ని రద్దు చేసి నేరుగా, వెంటనే లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపాదనలను పంపాయి.

జోన్లుగా పరిశ్రమల విస్తరణ

ఇండస్ట్రీలను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయొద్దని ఫెడరేషన్స్ సూచించాయి. వివిధ పరిశ్రమలను వేర్వేరు ప్రాంతాల్లో విస్తరించా లన్నాయి. ప్రభుత్వ స్థలాలను నాలుగు జోన్లుగా విభజించాలని చెబుతున్నాయి. ప్రైమ్, పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాలుగా గుర్తించాలని చెబుతున్నాయి. ఇందులో నాలుగో స్థానంలో ఉన్న స్థలాల్లో పెట్టుడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహాకాలు ఇవ్వాలని.. అలా చేస్తే పారిశ్రామిక వికేంద్రీకరణ జరుగుతుందని అంటున్నాయి. అలాగే జోన్లవారీగా ప్రోత్సాహాకాలను వర్గీకరించాలని అంటున్నారు. దీనివల్ల ప్రైమ్ ఏరియాల్లోనే కాకుండా పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయని అభిప్రాయపడ్డాయి. 

నైపుణ్య శిక్షణ, పరిశోధన కేంద్రాలు

రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అందించేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఫెడరేషన్స్ చెబుతున్నాయి. మానవ వనరులు ఎక్కడ ఉంటే పరిశ్రమలు అక్కడికి రావడానికి ఆసక్తిని కనబరుస్తాయి. అలాగే నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా ఆర్‌అండ్‌డీ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఫెడరేషన్స్ సూచించాయి. అయితే ఈ రెండు అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టింది. దాదాపు రూ.300 కోట్లతో తెలంగాణలో స్కిల్ సెంటర్లు పెట్టేందుకు ప్రపంచస్థాయిలో యూనివర్సిటీలు ముందుకొచ్చాయి.

బడ్జెట్ సమావేశాల్లో ముసాయిదా..

ఈ నెల 24వ తేదీ నుంచి ఫుల్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశాల్లోనే ఆరు పాలసీల ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెడుతామని ఇప్పటికే ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. అయితే ఈ పాలసీలను చట్టంగా చేస్తారా? గతంలో బీఆర్‌ఎస్ తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక చట్టంలోనే ఈ సవరణలు చేస్తారా? లేదా ప్రత్యేకంగా అమలు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇండస్ట్రీ ఫెడరేషన్స్ ప్రతిపాదనలు ఏంటి?

ఎంఎస్‌ఎంఈ పాలసీకి సంబంధించే ప్రభుత్వానికి ఎక్కువ ప్రతిపాదనలు అందాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఆధునిక ప్రపంచంలో ఎంఎస్‌ఎంఈలను గేమ్ చేంజర్స్‌గా చెబుతున్నారు. అమెరికాలో కొత్త ఉద్యోగాల కల్పనలో 80 శాతం వాటా ఎంఎస్‌ఎంఈలదే అంటే వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోనూ ఎంఎస్‌ఎంఈలకు పెద్దపీట వేయడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని రేవంత్‌రెడ్డి సర్కారు భావిస్తోంది. అందుకే దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సర్కారు ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొస్తోంది. రాష్ట్రంలోనూ ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తుందని సర్కారు అభిప్రాయపడుతోంది.