06-11-2025 08:43:28 AM
పాట్నా: బీహార్ అసెంబ్లీ తొలివిడత ఎన్నికల పోలింగ్(Bihar election 2025) ప్రారంభమై కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. భద్రతా కారణాలతో 56 పోలింగ్ కేంద్రాలలో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly elections) మొత్తం 243 నియోజకవర్గాలు ఉన్నాయి. తొలివిడతలో 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 1,314 మంది తొలివిడత ఎన్నికల బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో 3.75 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడత ఎన్నికలకు 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ 57 స్థానాలు బీజేపీ 48 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎల్ జేపీ 14 స్థానాలు, ఆర్ఎల్ఎం నుంచి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహాగఠ్ బంధన్(Mahagathbandhan) పక్షాల్లో ఆర్ జేడీ అత్యధికంగా 73 చోట్ల పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి 24, సీపీఐ-ఎంఎల్ తరఫున 14 మంది బరిలో ఉన్నారు. ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు.
ఈరోజు ఎన్నికలు ఎదుర్కొంటున్న మొత్తం 1,314 మంది అభ్యర్థులలో 122 మంది మహిళలు, 1192 మంది పురుషులు ఉన్నారు. ఓటు వేయడానికి అర్హత ఉన్న మొత్తం 3,75,13, 302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు, 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. మొత్తం 7,37,765 మంది 18-19 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు, 6,736 మంది 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల ఓటర్లు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలలో 36,733 గ్రామీణ ప్రాంతాలు, 8,608 పట్టణ ప్రాంతాలు, 320 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 926 అన్నీ మహిళల నిర్వహణలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, 107 వికలాంగుల నిర్వహణలో ఉన్న పోలింగ్ కేంద్రాలున్నాయి. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.