ఇన్ఫీ బంపర్ డివిడెండుతో ఐదు నెలల బాలుడికి రూ.4.2 కోట్లు
ముంబై, ఏప్రిల్ 19: ఇన్ఫోసిస్ ప్రకటించిన బంపర్ డివిడెండుతో ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి ఐదు నెలల మనుమడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి సంపద రూ.4.2 కోట్ల మేర పెరగనుంది. ముగిసిన ఆర్థిక సంవత్సరానికి షేరుకు రూ.20 చొప్పున తుది డివిడెండును, రూ.8 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డివిడెండును కంపెనీ జూలై 1న చెల్లిస్తుంది. గత నెలలో నారాయణమూర్తి తన మనుమడికి రూ.240 కోట్ల విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చారు. దీంతో ఒక్కో షేరుకు మొత్తం రూ.28 డివిడెండు చెల్లింపుతో ఏకాగ్రహ్‌మూర్తికి రూ.4.2 కోట్లు అందుతాయి. ప్రస్తుతం నారాయణమూర్తి వద్ద 1.51 కోట్ల ఇన్ఫీ షేర్లు ఉన్నాయి. కంపెనీ మొత్తం ఈక్విటీ మూలధనంలో ఇది 0.36 శాతం. నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.






