16 July, 2026 | 1:56 PM

క్షీణించిన విప్రో లాభం

20-04-2024 12:20 AM

ఆదాయం రూ.22,208 కోట్లు

బెంగళూరు, ఏప్రిల్ 19: దేశంలో టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో లాభాలు తగ్గాయి. కంపెనీ నికరలాభం 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 8 శాతం క్షీణించి రూ.2,835 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 3,074 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన క్యూ4లో విప్రో ఆదాయం కూడా రూ. 23,190 కోట్ల నుంచి రూ.22,208 కోట్లకు తగ్గింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేర్‌హోల్డర్లకు షేరుకు రూ.1 చొప్పున మధ్యంతర డివిడెండును సిఫార్సుచేయగా, తుది డివిడెండును తదుపరి రోజుల్లో ప్రకటించనున్నట్టు విప్రో తెలిపింది.

గైడెన్స్ 2.62 బిలియన్ డాలర్లు

ఈ జూన్ 30తో ముగిసే త్రైమాసికంలో తమ ఐటీ సర్వీసుల ఆదాయం 2.62 బిలియన్ డాలర్ల నుంచి 2.67 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండవచ్చని విప్రో గైడెన్స్‌ను వెల్లడించింది. ఇది మార్చి త్రైమాసికంతో పోలిస్తే  శాతం నుంచి +0.5 శాతంగా అంచనా.   2024 మార్చి క్యూ4లో డాలర్ల రూపంలో విప్రో ఐటీ సర్వీసుల ఆదాయం డిసెంబర్ త్రైమాసికంలో పోలిస్తే 0.1 శాతం వృద్ధితో 2,657 కోట్లకు చేరగా, ఏడాది ప్రాతిపాదికన చూస్తే 6.4 శాతం తగ్గింది. విప్రో సవాళ్లతో కూడిన వాతవరణంలో కూడా తమ ఐటీ సర్వీసుల మార్జిన్లు 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అపర్ణా అయ్యర్ చెప్పారు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోను సమీకరించామన్నారు. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో విప్రో షేరు 1.92 శాతం పెరిగి రూ.452.85 వద్ద నిలిచింది.

భారీగా తగ్గిన ఉద్యోగుల సంఖ్య

ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విప్రోలో ఉద్యోగుల సంఖ్య భారీగా 9.5 శాతం తగ్గింది. 2023 మార్చి చివరినాటికి కంపెనీ రోల్స్‌లో 2,58,570 మంది ఉద్యోగులు ఉండగా, ఆ సంఖ్య తాజాగా ముగిసిన మార్చి 31నాటికి 2,34,054కు తగ్గింది. 

* 2024  పరిశ్రమకు సవాళ్ల సంవత్సరం. స్థూల ఆర్థిక వాతావరణం అనిశ్చితంగా ఉంది. అయితే భవిష్యత్ అవకాశాల పట్ల నేను ఆశాభావంతో ఉన్నా. మనం ప్రధాన టెక్నాలజీ మార్పులకు చేరువలో ఉన్నాం. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మా క్లయింట్ల అవసరాల్ని సమూలంగా మారుస్తున్నది. విప్రోలో 

మేము ఈ మార్పుకు సిద్ధంగా ఉన్నాం

పల్లియా 

సీఈవో, ఎండీ, విప్రో