ఈ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్
2023 లో అధిక రాబడులు ఇచ్చిన స్కీమ్స్
ఆర్థిక సంవత్సరం ముగిసిన సందర్భంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులపై లాభాలు ఏ మేరకు వచ్చాయో చూసుకోవడం సహజం. 2023 ఆర్థిక సంవత్సరంలో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో మదుపుచేసినవారు అధిక రాబడుల్ని ఆర్జించారు. బ్లూచిప్ షేర్లు కూడా తక్కువేమీ పెరగలేదు. గత ఏడాదికాలంలో నిఫ్టీ సూచి 30 శాతం ర్యాలీ జరిపింది. ఈ ప్రధాన సూచీ పనితీరుతో పోల్చిచూస్తే, అంతకుమించి అధిక లాభాల్ని ఇచ్చిన స్కీమ్స్ చూద్దామా!
స్మాల్ క్యాప్ ఫండ్స్
ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలనే తీసుకొచ్చాయి. స్మాల్ క్యాప్ స్కీమ్స్ వాటి మొత్తం ఆస్తుల్లో కనీసం 65 శాతం స్మాల్‌క్యాప్ షేర్లలో పెట్టుబడి చేస్తాయి. మార్కెట్ క్యాపిటలై జేషన్‌లో 250 ర్యాంక్ కంటే దిగువన ఉన్న కంపెనీలనే స్మాల్‌క్యాప్ స్టాక్స్‌గా వ్యవహరిస్తారు.
ఇన్వెస్టర్లకు సూచన
గతంలో ఆయా మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చిన రాబడులు భవిష్యత్ లాభాలకు గ్యారంటీ కాదన్న సంగతిని ఇన్వెస్టర్లు గుర్తించాలి. మరోమాటలో చెప్పాలంటే 2023 ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనపర్చిన స్కీమ్స్ భవిష్యత్‌లోనూ అదే తరహాలో రాబడులు ఇస్తాయని భావించడం సబబు కాదు.
లార్జ్‌క్యాప్ ఫండ్స్
లార్జ్‌క్యాప్ ఫండ్స్ వాటి ఆస్తుల్లో కనీసం 80 శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే పెట్టుబడి చేయాలి. మార్కెట్ విలువలో టాప్ 100 కంపెనీలను లార్జ్‌క్యాప్స్‌గా వ్యవహరిస్తారు.
స్మాల్‌క్యాప్ ఫండ్స్ వార్షిక రాబడి
శాతం
బంధన్ స్మాల్‌క్యాప్ ఫండ్ 69.54
క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్ 66.51
మహింద్రా మనులైఫ్ స్మాల్‌క్యాప్ ఫండ్ 65.84
ఐటీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ 62.71
ఇన్వెస్కో స్మాల్‌క్యాప్ ఫండ్ 53.24
ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ 52.90
ఈ టేబుల్‌లో స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను పరిశీలిస్తే బంధన్ స్మాల్‌క్యాప్ ఫండ్ గత ఏడాదికాలంలో అత్యధికంగా 69 శాతం లాభాన్ని తెచ్చిపెట్టింది. మరో మూడు స్కీములు 60 శాతంపైగా రాబడుల్ని ఇచ్చాయి.
మిడ్‌క్యాప్ ఫండ్స్
సెబీ ఆదేశాల ప్రకారం ఈ ఫండ్స్ వాటి పెట్టుబడి నిధుల్లో కనీసం 65 శాతం మిడ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ విలువలో 101 నుంచి 249 వరకూ ర్యాంకుల్లో ఉన్న కంపెనీలను మిడ్‌క్యాప్ స్టాక్స్‌గా వ్యవహరిస్తారు.
మిడ్‌క్యాప్ ఫండ్స్ వార్షిక రాబడి
శాతం
క్వాంట్ మిడ్‌క్యాప్ ఫండ్ 65.66
ఐటీఐ మిడ్‌క్యాప్ ఫండ్ 62.70
మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ 60.37
మహింద్రా మనులైఫ్ మిడ్‌క్యాప్ ఫండ్ 59.61
హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఫండ్ 57.23
జేఎం మిడ్‌క్యాప్ ఫండ్ 56.98
గత ఏడాది అత్యున్నత పనితీరు ప్రదర్శించిన మిడ్‌క్యాప్ ఫండ్స్ గరిష్ఠంగా 65 శాతం వరకూ లాభాల్ని అందించాయి. మూడు స్కీమ్‌లు 60 శాతంపైగా రాబడుల్ని ఇచ్చాయి.
లార్జ్‌క్యాప్ ఫండ్స్ వార్షిక రాబడి
శాతం
క్వాంట్ లార్జ్‌క్యాప్ ఫండ్ 52.38
బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూచిప్ ఫండ్ 48.74
జేఎం లార్జ్‌క్యాప్ ఫండ్ 45.42
నిప్పన్ ఇండియా లార్జ్‌క్యాప్ ఫండ్ 44.82
తౌరస్ లార్జ్‌క్యాప్ ఫండ్ 44.04
2023 లో ఉన్నతమైన పనితీరు కనపర్చిన లార్జ్‌క్యాప్ ఫండ్స్ 40 శాతంపైగా రాబడులు ఇచ్చాయి. ఒక్క స్కీమ్ మాత్రం అందించిన లాభం మాత్రం 50 శాతాన్ని మించింది.






