నేడు గ్రూప్-1 పరీక్ష
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ
31 జిల్లాల్లో 897 సెంటర్లు ఏర్పాటు
అరగంట ముందే గేట్లు క్లోజ్
హాజరుకానున్న 4.03లక్షల మంది అభ్యర్థులు
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా నేడు గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీజీపీఎస్‌సీ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. 10 గంటలలోపే కేంద్రానికి చేరుకోవాలని, ఆ తర్వాత వచ్చే అభ్యర్థులకు లోనికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించనున్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకు అదనపు పరికరాలను అందుబాటులో ఉంచారు. పరీక్ష సజావుగా నిర్వహించేందకు ఐడెంటిఫికేషన్ అధికారులను కేంద్రాల వద్ద నియమించారు. వీరు ఒక్కరు వంద మంది అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో స్కాడ్, ఇన్విజిలేటర్స్ సిబ్బందితోపాటు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు టీజీపీఎస్‌సీ పేర్కొంది.
ఏ4 సైజులో హాల్‌టికెట్లు..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్ల ను ఏ4 సైజులో ప్రింట్ తీసుకోవాలని తెలిపారు. కలర్‌ప్రింట్ అయితే బాగుంటుం vదని పేర్కొన్నారు. దానిపై కేటాయించిన స్థలంలో లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించాల్సి చెప్పారు. ఒకవేళ ఫొటో పెట్టకపోతే అనుమతించరు.
వీటికి అనుమతిలేదు...
పరీక్ష రాసే అభ్యర్థులు కాలిక్యులేటర్, పేజర్స్, సెల్‌ఫోన్, ట్యాబ్లెట్స్, పెన్‌డ్రైవ్, బ్లూ టూత్, మ్యాథమెటికల్ టేబుల్స్, బ్యాగ్స్, రైటింగ్ ప్యాడ్స్, ఇతర ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్‌కు అనుమతిలేదు. అభ్యర్థులకు జారీ చేసే హాల్‌టికెట్ వెనుకాల సూచనలను ఫాలో కావాలని టీజీపీఎస్సీ తెలిపింది.
స్పెషల్ బస్సులు...
గ్రూప్ ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సుల ను టీజీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాలిచ్చింది. శనివారం సాయంత్రం నుంచే అభ్యర్థుల రద్దీ హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఎక్కువ ఉన్నందున ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగ ర్, ఆరాంఘర్ పాయింట్లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. ఆయా ట్రాఫిక్ జనరేటింగ్ పా యింట్లలో ప్రత్యేక అధికారులను నియమించారు.
రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో ‘మే ఐ హెల్ప్ యూ’ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతోపాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు వివరిస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనే పరీక్షకు హజరవుతున్న దాదాపు 1.70 లక్షల మంది రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను ఆర్టీసీ అందుబాటు లో ఉంచినట్లు తెలిపింది. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని కోరుతూ అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.






