11 May, 2026 | 8:14 PM

Breaking News

భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

11-05-2026 07:04 PM

వేములవాడ,(విజయక్రాంతి): రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం భక్తులలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అలాగే తెలంగాణలో ఏ శుభకార్యం, పండుగ జరిగినా ముందుగా వేములవాడ కు స్వామి వారిని  దర్శించుకోవడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది.

ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 58,867 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, కోడె మొక్కులు చెల్లించడం, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చనలు తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.