కిక్కిరిసిన సలేశ్వరం

23-04-2024 01:59:36 AM

జాతరకు పోటెత్తిన భక్తజనం

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 22 (విజయక్రాం తి): తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన నల్లమల సలేశ్వరం జాతరకు భక్తు లు పోటెత్తారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈసారి అధికారులు ఈనెల 22 నుంచి 24వరకు మూడు రోజులే జాతరకు అడవిలోకి అనుమతిస్తున్నట్టు ప్రకటించడంతో యాత్రికులు, భక్తులు ఒక్కసారిగా పెరిగిపోయారు. లింగమయ్యను కొలిచే రోజు సోమవారం కావడంతో భక్తులు ఎక్కువమంది యాత్రకు బయలుదేరారు. విద్యార్థులకు పరీక్షలు కూడా పూర్తి కావడంతో పిల్లాపాపలతో కలిసి జాతరకు క్యూ కట్టారు. ఈసారి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుండటంతో సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు జాతరకు తరలివచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు. గతంలో అధికారుల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగి ఇద్దరు యాత్రికులు మృతి చెందిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని అలాంటి పొరపాట్లు జరగకుండా భక్తులను పరిమిత స్థాయిలోనే లోయ లోనికి వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ యాజమాన్యం ఆయా డిపో పరిధిలో ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. యాత్రకు వెళ్లే వాహనదారులు రోడ్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.