29 March, 2026 | 4:49 AM

కరీంనగర్‌లో క్రిప్టో బాధితులు

29-03-2026 02:13 AM
  1. పోలీసులకు అందుతున్న ఫిర్యాదులు
  2. కొనసాగుతున్న దర్యాప్తు

కరీంనగర్, మార్చి 28 (విజయక్రాంతి): కరీంనగర్‌లో 137 కోట్ల స్కాంను బయటపెట్టిన పోలీసులు.. ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0 కింద సైబర్ మోసాలకు సహకరించే మ్యూల్ బ్యాంకు ఖాతాల నెట్వర్క్‌ను చేదించే పనిలో పడ్డారు. కరీంనగర్‌లో క్రిప్టో కరెన్సీ నెట్‌వర్క్‌లో మోసపోయిన వారు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రధాన నిందితుడికి కరీంనగర్ కిసాన్ నగర్‌లో ఉన్న రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకుకు సంబంధించిన కొంతమంది సిబ్బందితో కలిసి ఈ పని నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఆర్‌బిఎల్ బ్యాంకుకు సంబంధించిన మేనేజర్ భువనగిరి కళ్యాణ్, క్యాషియర్ ఆయేషా బేగం సహకరించినట్లు తేలింది. వర్చువల్ ఖాతాల ద్వారా సుమారు 12 కోట్లు, ఆర్‌బిఎల్ బ్యాంకుకు చెందిన ఏడు మ్యూల్ ఖాతాల్లో 125 కోట్లకు పైచీలు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. మొత్తం 137 కోట్ల భారీ కుంభకోణం బయటపడింది. ఈ కేసులో నిందితులంతా డిప్లొమా, ఇంజినీరింగ్ విద్యార్థులే కావడం విశేషం.

బండారి సాయిరామ్ అనే స్థానికుడు, చైనా వ్యక్తులతో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. నిందితులు ఫేక్ అకౌంట్లు తెరిచి డబ్బులు మళ్లించి ఇంత భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సాయిరామ్.. ప్రతి లావాదేవీపై క్రిప్టో కరెన్సీ ద్వారా 2 శాతం కమిషన్ తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.