27 July, 2026 | 5:28 PM

గ్రామ భద్రతకు రూ.8 లక్షల సీఎస్ఆర్ నిధులు

27-07-2026 04:54 PM

 విద్యుత్ లైన్ షిఫ్టింగ్‌కు దశమి ల్యాబ్ ముందుకు

చిట్యాల,(విజయ క్రాంతి): చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గ్రామ మధ్యగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ కారణంగా గత 30 సంవత్సరాలుగా వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్‌లు, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ సమస్య పరిష్కారానికి దశమి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఎస్ఆర్ నిధుల కింద రూ.8 లక్షలు  మంజూరు చేసి విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు చేపట్టేందుకు సోమవారం ముందుకు వచ్చింది. గ్రామంలో నెలకొన్న ఈ సమస్యను నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.

దీంతో దశమి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో విద్యుత్ లైన్‌ను గ్రామం నుంచి సురక్షిత ప్రాంతానికి మార్చేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం మాట్లాడుతూ, గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి సహకరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు, అలాగే దశమి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యానికి గ్రామ ప్రజల తరఫున, గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, జల ప్రశాంత్, తెలుసూరి నరసింహ, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, కంపెనీ ప్రతినిధులు సురేష్, శ్రీకాకుళం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.