28 August, 2026 | 3:11 AM

చెట్లే మానవాళికి జీవనాధారం

27-08-2026 12:45 PM

ఖమ్మం,ఆగస్టు,27,విజయక్రాంతి): మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు చెట్లే ప్రధాన జీవనాధారమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో నిర్వహించిన 'వనమహోత్సవం'(Van Mahotsav) కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి మంత్రి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి(Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితికి వాతావరణ సమతుల్యత దెబ్బతినడమే కారణమన్నారు.  భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే మనం ఇచ్చే నిజమైన కానుక అని తెలిపారు.

నాటిన ప్రతి మొక్కను చెట్టుగా మారే వరకు పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు దత్తత తీసుకున్నట్లు సంరక్షించాలన్నారు. ప్రతి గ్రామంలోనూ పచ్చదనం పెంపొందించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. పర్యావరణ పరిరక్షణ(Environmental Protection) కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, తిరుమలాయపాలెం మండల ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహశీల్దార్ విల్సన్, ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ నల్లమల్ల కీర్తి నీరన్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.