21 August, 2026 | 7:28 PM

2 నుంచి టోల్ మోత

23-05-2024 03:46 AM

చార్జీలను 5 శాతం పెంచనున్న ఎన్‌హెచ్‌ఏఐ!

హైదరాబాద్/సంగారెడ్డి, మే 22 (విజయక్రాంతి): వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) షాకిచ్చింది. జూన్ 2వ తేదీ నుంచి టోల్ చార్జీలు  పెంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు టోల్ ప్లాజాలకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఏటా ఏప్రిల్ 1న టోల్ చార్జీలను ఎన్‌హెచ్‌ఏఐ సవరిస్తుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగుతున్న కారణంగా ఈసీ ఆదేశాల మేరకు టోల్ ట్యాక్సీ పెంపు నిర్ణయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ వాయిదా వేసింది.

జూన్ 1 నాటికి దేశంలో అన్ని విడతల్లో ఎన్నికలు ముగుస్తాయి. దీంతో జూన్ 2 నుంచి టోల్ చార్జీలను పెంచనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. పెంచిన టోల్ ధరలు జూన్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతి సారి 5 శాతం మేర చార్జీలను ఎన్‌హెచ్‌ఏఐ పెంచుతుంది. ఈ సారి కూడా అదే స్థాయిలో పెంచే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 855 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి.

వాహనాల స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.250 వరకు ఎన్‌హెచ్‌ఏఐ టోల్  చార్జీలను వసూలు చేస్తుంది. తెలంగాణలో హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారులను ప్రధానంగా చెబుతుంటారు. ఈ రహదారులు నిత్యం బిజీగా ఉంటాయి. దీంతో ఈ రెండు రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలు మీదుగా రోజుకు దాదాపు 57వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెబుతున్నారు. తాజాగా టోల్ చార్జీల పెంపుతో ఎన్‌హెచ్‌ఏఐకు రాబడి భారీగా పెరిగనుంది.

చిల్లర సమస్య లేకుండా.. 

తాజాగా సవరించిన ధరలతో చిల్లర సమస్య లేకుండా ఎన్‌హెచ్‌ఏఐ జాగ్రత్తలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పుడు ఐదు శాతం ఛార్జీలను పెంచడం వల్ల ఒక వాహనం టోల్ చార్జీ రూ.59కు పెరగొచ్చు. దీని టోల్ ప్లాజా నిర్వాహకులు తమ వద్ద చిల్లరను ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య లేకుండా ఉండేందుకు పరిపూర్ణంగా టోల్ రుసుమును రూ.60ను చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్‌హెచ్‌ఏఐ ఈ విధంగా పలుమార్లు ధరలను సవరించింది. ఇలా అన్ని స్లాబుల్లో ఇదే విధంగా అదనంగా ధరలను పెంచనున్నట్లు సమాచారం. దీని వల్ల వాహనదారులపై మరింత భారపడనుంది.

చార్జీలు సరే.. సౌకర్యలేవీ..?

వాహనదారుల నుంచి ఎన్‌హెచ్‌ఏఐ పన్నులు వసూలు చేస్తున్నా సౌకర్యాలు కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారిపై తాగునీటి సదుపాయంతో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో ఉన్న 65, 161వ జాతీయ రహదారులపై ఎక్కడా తాగునీటి సదుపాయం లేదు. కొన్ని చోట్ల మరుగుదొడ్లు ఉన్నా అక్కడ కనీస సౌకర్యాలు లేవు. రహదారులపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రహదారులపై జూన్ 1 వరకు పాత చార్జీలనే వాహనదారు నుంచి వసూలు చేయాలని అదేశాలు ఉన్నట్లు టోల్ గేట్ అధికారి ఒకరు తెలిపారు. కొత్త చార్జీలు వసూలు చేసేందుకు కావాలసిన సాఫ్ట్‌వేర్ సిద్ధంగా ఉందన్నారు. 

మరమ్మతులు చేయాలి..?: వాసునాయక్, వాహనదారుడు

ఇప్పటికే టోల్ గేట్ల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. అంతంత ధరలు వసూలు చేసినా సౌకర్యాలు మాత్రం కల్పించటం లేదు. రోడ్లకు మరమ్మతులు చేసి వాహనదారులకు మెరుగైన సౌకర్యలు కలిపించాలి. ఏటా చార్జీలు పెంచుతున్నారు. వారికి వాహనదారులకు ఇబ్బందులు కనిపించడం లేదు. పాత చార్జీలు వసూలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.