ఐఐఐటీ జంక్షన్ డీఎల్‌ఎఫ్ కారిడార్ పనులను పరిశీలించిన సైబరాబాద్ సీపీ
శేరిలింగంపల్లి, జూన్ 9 (విజయక్రాంతి): గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ వద్ద కొనసాగుతున్న రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ సోమవారం శేరిలింగంపల్లి ఏడీసీపీ హనుమంతరావు, సిఎంసి అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ నిర్మాణం వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి, మూడు నెలల పాటు స్పెషల్ ట్రాఫిక్ అడ్వైజరీ అమలు చేయాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.పనులు పూర్తయితే గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్హెచ్‌ఓ సురేష్, సిఎంసి అధికారులు,ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






