'డెకాయిట్' ప్రాణం పెట్టి చేసిన సినిమా: హీరో అడివి శేష్
అడివి శేష్ తన పాన్ ఇండియా చిత్రం 'డెకాయిట్”తో మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. నిర్మాత సుప్రియా యార్లగడ్డ, కో-ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. కొత్త దర్శకుడు షానీల్ డియో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ ట్రైలర్ రేజ్ ప్రెస్ మీట్ లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ… "ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని మంచి సినిమాలు చేశామనేదే నా లైఫ్ ఫిలాసఫీ. డెకాయిట్ ప్రాణం పెట్టి చేసిన సినిమా. ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కానీ ట్రైలర్‌లో వాటిని బయటపెట్టలేదు. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు. మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడనే అంశమే ఈ కథలో ప్రధానంగా ఉంటుంది. ఫీలింగ్స్‌పై ఒక మంచి కథ చెప్పాలని ప్రయత్నించాం.
ఈ సినిమా కథ లేయర్స్‌గా ఓపెన్ అవుతుంది. ఇది పూర్తిగా ఫీలింగ్స్ ఆధారంగా నడిచే సినిమా. సినిమా మొదటి అరగంట తర్వాత ఏం జరుగుతుందో గెస్ చేయడం చాలా కష్టం. చిన్నప్పుడు ఒక ఫంక్షన్‌లో డాన్స్ చేస్తుంటే “నువ్వు పొడుగ్గా ఉన్నావు, డాన్స్ చేయొద్దు” అన్నారు. అప్పటినుంచి నాకు డాన్స్‌పై భయం. కానీ తర్వాత క్రమంగా కాన్ఫిడెన్స్ పెంచుకున్నాను. ఈ సినిమాలో ఒక ఆర్గానిక్ డాన్స్ సీక్వెన్స్ ఉంటుంది.. చాలా అందంగా వచ్చింది" అన్నారు.
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ… "సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. డెకాయిట్లో నేను చేసిన సరస్వతి పాత్ర నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది" అన్నారు.
డైరెక్టర్ శానిల్ మాట్లాడుతూ… "ఈ సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం. డెకాయిట్ ఒక మంచి లవ్ స్టోరీతో కూడిన యాక్షన్ ఫిల్మ్" అన్నారు.
నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ… "ఈ కథకు అవసరమైన ప్రతిదాన్ని సమకూర్చాం. మొదటి నుంచే గ్రాండ్‌గా తీయాలనుకున్నాం. మంచి సినిమా ఎప్పుడూ విజయం సాధిస్తుంది" అని చెప్పారు.
సునీల్ మాట్లాడుతూ… "శేష్ చాలా జెన్యూన్‌గా సినిమా చేస్తారు. ఈ కథ, నా పాత్ర చాలా బాగున్నాయి. అనురాగ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ టీమ్‌తో పని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది" అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీఓపీలు ధనుష్ భాస్కర్, రవి కే చంద్రన్, రైటర్ అబ్బూరి రవి తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.




