26 May, 2026 | 1:22 AM

ఈడీ ఎదుట అమోయ్‌కుమార్

26-05-2026 12:32 AM
  1. భూదాన్ భూముల బదలాయింపుపై విచారణ
  2. మూడు సేల్ డీడ్లు, ఆస్తుల పత్రాలతో వెళ్లిన రంగారెడ్డి మాజీ కలెక్టర్ 
  3. విచారణలో కీలక విషయాలు

రంగారెడ్డి, మే 25 (విజయక్రాంతి): రాష్ట్రం లో సంచలనం సృష్టించిన భూదాన్ భూము ల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మ రం చేసింది. మనీ లాండరింగ్ కోణంలో జరుగుతున్న ఈ విచారణలో భాగంగా రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ సోమవారం హైదరా బాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యా రు.

2024 అక్టోబర్ నెలలోనే ఆయనను పలుమార్లు ప్రశ్నించి, వాంగ్మూలం నమోదు చేసిన ఈడీ.. తాజాగా మరికొన్ని కీలక ఆధారాలు, పత్రాలతో రావాలంటూ సమన్లు జారీ చేసిం ది. దీంతో ఆయన విచారణకు రావడం రాజకీయ, ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపు తోంది. అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 181, 182 లలో ఉన్న సుమారు 42 ఎకరాల విలువైన భూదాన్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి.

నిషేధిత 22 ఏ జాబితాలో ఉన్న ఈ భూములను ధరణి పోర్టల్‌లో రికార్డులను తారుమా రు చేసి మరీ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. నాగారంలోని ఈ భూమికి సంబంధించి స్థానికంగా ఉన్న వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని, ఖాదరున్నీసా అనే మహిళ పేరిట భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యేలా అమోయ్‌కుమా ర్ సహకరించారని, తద్వారా పెద్ద మొత్తం లో నిధులు చేతులు మారాయని ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే అమోయ్ కుమార్ హయాంలో జరిగిన మూడు వివాదాస్పద సేల్ డీడ్ల (1209, 1212, 4594) విషయంలో భారీ అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది.

ఒరిజినల్ పత్రాలతో విచారణకు..

ఈ నెల 21న ఈడీ జారీ చేసిన నోటీసుల ప్రకారం అమోయ్‌కుమార్ విచారణకు సదరు మూడు సేల్ డీడ్లకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు, తన బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆస్తు ల డిక్లరేషన్ డాక్యుమెంట్లను ఈడీ అధికారుల కు సమర్పించారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో 2023లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారం గా ఈడీ ఈ పీఎంఎల్‌ఏ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసుతో లింక్ ఉన్న నిందితులకు సంబంధించి రూ.4.8 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గతేడాది అటాచ్ కూడా చేసింది.

గత ప్రభుత్వ పెద్దల పాత్ర!

ధరణిలో రికార్డుల మార్పులు, నిషేధిత జాబితా నుంచి భూములను తొల గించడం వంటివి కేవలం కలెక్టర్ స్థాయిలోనే కాకుండా, గత ప్రభుత్వంలోని కొందరు కీలక పెద్దల ఒత్తిడి, ప్రమేయంతోనే జరిగాయనే ప్రచారం సాగుతోం ది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సుదీర్ఘ విచారణలో అమోయ్‌కుమార్ ఎలాంటి విషయాలను వెల్లడించారు? ఈ కేసులో మరికొందరు ఉన్నతాధికారులు లేదా రాజకీయ నాయకులకు ఈడీ నోటీసులు ఇవ్వబోతోందా? అనే ది ఆసక్తిగా మారింది.