5 April, 2026 | 4:08 AM

గ్లోబల్ టాలీవుడ్‌!

05-04-2026 12:00 AM

మట్టి కథలకు పుట్టిల్లుగా మారింది తెలుగు చిత్ర పరిశ్రమ. కేవలం వినోద సాధనంగానే కాకుండా, ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని, సృజనాత్మకతను చాటిచెప్పే శక్తిగా ఎదిగింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు హీరోల మార్కెట్ పెరగడం, అంతర్జాతీయ అవార్డులు వరించడం ‘గ్లోబల్ టాలీవుడ్’ ప్రభంజనానికి నిదర్శనం. 

ఒకప్పుడు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన టాలీవుడ్ ఇప్పుడు సరిహద్దులు చెరిపేసి గ్లోబల్ టాలీవుడ్‌గా అవతరించింది. ‘బాహుబలి’ నుంచి ప్రారంభమైన ఈ జైత్రయాత్ర, ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఆస్కార్ వరకు చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ సినిమా అంటే తెలుగు సినిమానే అనే స్థాయికి ఎదిగింది. ఇప్పటివరకు వచ్చిన పలు భారీ చిత్రాలు ఇప్పటికే టాలీవుడ్ జేజేలందుకునేలా చేశాయి. ఇక తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేందుకు మరికొన్ని పాన్-వరల్డ్ క్రేజీ ప్రాజెక్టులు ఈ 2026, 2027 సంవత్సరాల్లో రాబోతున్నాయి. 

టాలీవుడ్‌లో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న అంశాలెన్నో.. 

ప్రపంచ యవనికపై తెలుగు సంతకం మెరుస్తుండటంలో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కృషి ఎనలేనిది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహమూ చెప్పుకోదగ్గదే. ఈ ‘గ్లోబల్ టాలీవుడ్’ ప్రస్థానంలో చర్చించుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. కంటెంట్ ఓరియం టెడ్ చిత్రాల జోరు పెరగటం టాలీవుడ్ కీర్తి బావుటా అంతర్జాతీయ వేదికపై ఎగిరేలా చేసింది.

భారీ విజువల్స్, ఎపిక్ కథలు, పాన్-ఇండియా నుంచి పాన్ -వరల్డ్ స్థాయి ప్రమాణాలు. ఓటీటీ విప్లవం ఇందుకు దోహదపడిందనడంలో సందేహం లేదు. హైదరాబాద్‌ను భారతీయ సినిమా కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో పరిశ్రమకు అవసరమైన వసతుల కల్పనకు సర్కారు కృషి చేస్తుండటం గ్లోబల్ టాలీవుడ్‌కు కొండంత అండగా నిలిచింది. 

కథల్లో భావోద్వేగం.. నిర్మాణంలో భారీతనం.. 

‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలు భారతీయ ఇతిహాసాలను, వీరగాథలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఈ సినిమాల నిర్మాణంలో ఉపయోగించిన హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అంతర్జాతీయంగా ఉన్న సినీ ప్రియులను రంజింపజేశాయి. ఇలా భావోద్వే గభరితమైన కథలు, భారీ నిర్మాణ విలువల సమ్మిళిత చిత్రాలను వెండితెరపై ఆవిష్కరించటం ద్వారా టాలీవుడ్ మేకర్స్ ప్రపంచ ప్రేక్షకుల జేజేలందుకుంటున్నారు.

సుకుమార్, రాజమౌళి, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, కొరటాల శివ వంటి దర్శకులు కథలను కేవలం ప్రాంతీయ భాషకే పరిమితం చేయకుండా, విశ్వవ్యాప్త అప్పీల్ ఉండేలా తీర్చిది ద్దుతున్నారు. దీంతో పాన్ -ఇండియా నుంచి పాన్-వరల్డ్‌గా మారిన టాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ విజయపథంలో ఓటీటీ విప్లవం వారధిగా మారింది.

కరోనా పాండమిక్ సమయంలో స్ట్రీమింగ్ సర్వీసెస్ (ఓటీటీ) విస్తరణ వల్ల ‘పుష్ప’, ‘కార్తికేయ 2’ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యాయి. గ్లోబల్ టాలీవుడ్ ప్రస్థానంలో మైలురాళ్లుగా నిలిచే ఎన్నో అంశాలతో వచ్చిన సినిమాలు ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించాయి. తెలుగు చిత్రసీమను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ద రూల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.

కేవలం 14 రోజుల్లోనే రూ.1500 కోట్లకుపైగా వసూళ్లను సాధించి, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా భారీ వసూళ్లను రాబడుతూ తన గ్లోబల్ ప్రభావాన్ని చాటుతోంది. ప్రభాస్ కథానాయకుడుగా దర్శకుడు నాగ్‌అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూ ళ్లు సాధింటం ద్వారా తెలుగు సినిమా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.500 కోట్ల మార్కును దాటి, ఉత్తర అమెరికా వంటి దేశాల్లో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్‌ను సాధించింది. ఇలా ఇప్పటివరకు వచ్చిన సినిమాలే కాక, రాబోయే భారీ ప్రాజెక్టులు కూడా తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచేలా రూపుదిద్దుకుంటున్నాయి.

విష్ణు మంచు నటించిన ‘కన్నప్ప’ చిత్రం టీజర్ ప్రతిష్టాత్మక 77వ క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై, అంతర్జాతీయ పంపిణీదారుల ప్రశంసలను దక్కించుకుంది. భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాల జోరు టాలీవుడ్ ప్రపంచ సినీప్రేక్షకులకు చేరువయ్యేలా చేశాయి. 

రాబోయే పాన్‌వరల్డ్ క్రేజీ ప్రాజెక్టులు 

ఇప్పటివరకు వచ్చిన సినిమాలే కాక, రాబోయే భారీ ప్రాజెక్టులు కూడా తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచేలా రూపుదిద్దుకుంటున్నాయి. వాటిల్లో తొలుత చెప్పుకోదగ్గది మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘వారణాసి’. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం గ్లోబల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సుమారు 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తద్వారా ఇదే ఒక భారతీయ చిత్రానికి అత్యంత భారీ విడుదల కానుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ చిత్రం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సినిమా ‘సలార్: పార్ట్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ సీక్వెల్ ఈ ఏడాది చివరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

హైదరాబాద్ భారతీయ సినిమా కేంద్రం 

ముంబై కేంద్రంగా ఉన్న బాలీవుడ్ తన ప్రాభవాన్ని కోల్పోతున్న తరుణంలో హైదరాబాద్ ఇప్పుడు భారతీయ సినిమాకు ప్రధాన కేంద్రంగా భాసిల్లుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం ఇతర భాషల నటులను, సాంకేతిక నిపుణులను టాలీవుడ్ వైపు ఆకర్షిస్తున్నాయి.

ఇక్కడి ప్రభుత్వం చిత్రపరిశ్రమ అభివృద్ధికి అందిస్తున్న సహకారం టాలీవుడ్ విజయ పథంలో నడిచేలా చేస్తోంది. కళాకారులకు, కళాపోషకుల గుర్తింపు కన్నా మించిన ప్రశంస ఉండదంటారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభాపాటవాలను గౌరవిస్తూ వారికి తగిన ప్రోత్సహిస్తోందీ రాష్ట్ర ప్రభుత్వం. ‘తెలంగాణ గద్దర్ సినిమా పురస్కారాలను అందజేయడం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సినీ కళాకారుల్లో ఉత్సాహం నింపుతోంది. 

 నరేశ్ ఆరుట్ల