దమ్మున్నోడికే అధ్యక్ష పీఠం
గల్లీలో కొట్లాడే వాడు కాదు
ఐదుగురు సీఎంలతో కొట్లాడిన చరిత్ర నాది
రాజాసింగ్ వీడియోపై ఈటల చురకలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక బీజేపీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీస్తుందా అంటే ఆ పార్టీ నాయకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, అంతకుముందు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా నియామకమైన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక అనివార్యంగా మారింది. అయితే బీజేపీ అధ్యక్ష పదవి ఈటల రాజేందర్‌కు ఖరారు అయ్యిందని, అధికారిక ప్రకటనే మిగిలిందని గత నెల రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి విధితమే.
కానీ బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అధ్యక్షుడి ఎంపికపై ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా అగ్రెసివ్‌గా ఉన్న వ్యక్తిని, దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడే వ్యక్తిని పార్టీ చీఫ్‌గా నియమిస్తే బాగుంటుందన్నాడు. రాజాసింగ్ వీడియోకు కౌంటర్‌గా అధ్యక్ష పదవిని కాంక్షిస్తున్న ఈటల రాజేందర్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజగిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మహేంద్రహిల్స్‌లో కాలనీ వాసులతో బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఈటల మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు చెప్పకనే చెప్పిన ఆయన రాష్ట్ర చీఫ్ ఎంపికపై సంచనల వ్యాఖ్యలు చేశారు.
నా 24 యేండ్ల చరిత్ర ప్రజల కళ్లముందే ఉందని, ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర తనకు ఉందన్నారు. నిన్ననో, మొన్ననో నా పైన ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారని, సందర్భం వచ్చినప్పుడు అవసరమైతే కుంభస్థలాన్ని కొట్టగలిగే దమ్మున్నోడు కావాలి గుర్తుపెట్టుకో అని పరోక్షంగా రాజాసింగ్‌కు ఈటల చురకలు అంటించారు. బీజేపీ పార్టీ చీఫ్‌గా దమ్మున్నోడే కావాలని, గల్లీలో కొట్లాడేవారు కాదన్నారు. ఆయన ఫైటర్ కావాలంటున్నారని, ఏ ఫైటర్.. స్ట్రీట్ ఫైటరా? అని ఎద్దేవా చేశారు. సందర్భం వచ్చినప్పుడు జేజమ్మలతో కొట్లాడుతామని, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చిన హమీలను నెరవేర్చకుంటే నీ సంగతేందని ఈ సీఎంపైనా కూడా కొట్లాడే బాధ్యత తనకు ఉందన్నారు. అలాగే ఎవ్వరికి ఏ పదవి ఇవ్వాలో బీజేపీ అధిష్ఠానం చూసుకుంటుందని, వారసత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదన్నారు. రాజాసింగ్ వీడియో నేపథ్యంలో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారని రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోంది.






