6 May, 2026 | 12:14 AM

కౌశిక్‌పై పొన్నం పరువు నష్టం కేసు

24-06-2024 01:19 AM
  1. ఫ్లుయాష్ ఆరోపణలపై 10 కోట్లకు దావా
  2. టీన్యూస్, నమస్తే తెలంగాణకు నోటీసులు

హైదరాబాద్/కరీంనగర్, జూన్ 23 (విజయక్రాంతి): ఫ్లు యాష్ కుంభకోణంలో రూ. 100 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ న్యాయపరమైన చర్యలకు దిగారు. కౌశిక్‌రెడ్డిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. మంత్రి తరఫున న్యాయవాది పూర్ణచందర్‌రావు కౌశిక్‌రెడ్డికి నోటీసులు పంపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన కౌశిక్‌రెడ్డితో పాటు ఆ వార్తను ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్‌కుమార్ రావు, వార్తను ప్రచురించిన నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సైతం లీగల్ నోటీసులు పంపించినట్టు తెలిపారు.

ఫ్లు యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుందని, దాన్ని వ్యక్తిగతంగా వినియోగించుకోవడానికి వీలుండ దని పూర్ణచందర్‌రావు స్పష్టం చేశారు. ఫ్లు యాష్‌ను టెండర్ ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లు చేస్తారని తెలిపారు. రామగుండం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఈ ఫ్లు యాష్‌తో మంత్రికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. హుజూరాబాద్‌లో లారీలను ఆపి, ఓవర్ లోడ్‌తో వెళ్తున్నాయన్న కారణంతో మంత్రి పొన్నం ప్రతి లారీ నుంచి డబ్బులు తీసుకుంటున్నారని కౌశిక్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. లారీల్లో ఎంత ఫ్లు యాష్ వెళ్తోందనే అంశం ఎన్టీపీసీకి సంబంధించినదని పూర్ణచందర్‌రావు తెలిపారు. లోడింగ్ చేసిన వారిని అడగాల్సింది పోయి మంత్రిపై కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేశారని, ఆయన పరువుకు భంగం కలిగించారని అన్నారు. వ్యక్తిగత, రాజకీయ కక్షతో మంత్రిపై ఆరోపణలు చేసినందుకే ఆయనకు నోటీసులు పంపించినట్లు తెలిపారు.