మూసీ సుందరీకరణలో మేమెక్కడ?
మూసీ పునరుజ్జీవనం, సుందరీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీకి మూసీ పరిరక్షణ సమితి, మూసీ పరీవాహక గ్రామా ల సమాఖ్య ఆధ్వర్యంలో పలు గ్రామాల ప్రజలు ఆన్‌లైన్‌లో వినతిపత్రం సమర్పించారు. వందల గ్రామాల ప్రజల జీవితాలు మూసీతో పెనవేసుకొని ఉన్నాయని, తమకు ఉపాధి కల్పించాలని కోరారు. తమ గ్రామాలను అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు.
విషయం: మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై మూసీ పరీవాహక గ్రామాల ప్రజల అభిప్రాయాలు.
గౌరవ మంత్రివర్యులకు నమస్కారం. దాదాపు మూడు జిల్లాలు, 20 మండలాలు, వంద గ్రామాల ప్రజల జీవితాలు మూసీతో పెనవేసుకొని ఉన్నాయి. మూసీని శుద్ధి చేసి, మా గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని నది ద్వారా అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిసి చాలా సం తోషిస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ ప్రాజెక్టు గురించి అనేక వార్తలు వింటున్నాం. హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సమావేశంలో ప్రదర్శించిన రంగు రంగుల చిత్రాలను చూశాం.
గండిపేట, లంగర్ హౌజ్ ప్రాంతాల్లో మూసీ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందని తెలిసింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం బ్యాంకు నుంచి రూ.41 వేల కోట్లు అప్పు తెస్తుందని విన్నాం. వందల ఇండ్లను కూలగొడతారని, వేల కుటుంబాలు రోడ్డున పడతాయనే వార్తలు పత్రికల్లో చూస్తున్నాం. అయితే, ఇప్పటివరకు అధికారులుగాని, ప్రజాప్రతినిధులుగాని మా ఊర్లలోకి వచ్చి ఈ ప్రాజెక్టు గురించి మాకు వివరించే ప్రయత్నం చేయలేదు. గత వారం మానవ హక్కుల వేదిక కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. మీ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలని సలహా ఇచ్చారు. అందుకే ఈ విషయాలు మీ కమిటీ దృష్టికి తీసుకువస్తున్నాం.
గత కొన్ని మూడు దశాబ్దాలుగా మూసీ నీరు విషపూరితం కావడం వల్ల మా బతుకులు ఎట్లా విధ్వంసమయ్యాయో మీకు తెలియనిది కాదు. జంటనగరాల నుంచి డ్రైనేజీ నీరు, పరిశ్రమల రసాయనాల వ్యర్థాలతో మా జీవి తాలు, పశుసంపద, మత్స్య సంపద, పంటలు, తాటి, ఈత వనాలు ఎట్లా నాశనమయ్యాయో మీకు తెలుసు. వందల మంది మహిళలకు గర్భవిచ్ఛిన్నం జరిగింది. పశువుల్లో సంతానోత్పత్తి పడిపోయింది. చర్మ వ్యాధులు వస్తున్నాయి. మా భూముల్లో నాణ్యమైన పంటలు పండట్లేదు. తాటి, ఈత కల్లు కూడా కాలుష్యమయమైపోయాయి. ఈ నేపథ్యంలో ఈ గ్రామాల ప్రజల ప్రతినిధులైన మేము ఈ కింది ప్రతిపాదనలను మీ ముందు పెడుతున్నాం.
మా ప్రతిపాదనలు: మంత్రుల కమిటీ మా అభిప్రాయాలు సేకరించాలి. మూసీ ప్రాజెక్టు ఉన్న సోలిపేట గ్రామం వరకు ఈ ప్రాజెక్టును పొడిగించాలి. మూసీ దిగువన ఉన్న 70 గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం రూ.1000 కోట్లు కేటాయించాలి. అన్ని గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి, వాటిని గ్రామపపంచాయతీల అజమాయిషిలో ఉంచాలి. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన 24 కత్వాలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఉప కాలువలకు మరమ్మతులు చేసి సాగునీటి వ్యవస్థను బాగుచేయాలి. ఆయా గ్రామాల్లోని దాదాపు 70 చెరువుల్లో పేరుకుపోయిన రసాయనాలను తొలగించి, శుభ్రం చేయాలి. ఈ ప్రాంతంలోని ఏదులాబాద్ చెరువుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి, ఈ ప్రాంతంలోని మత్స్యకారుల కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.
యాదవ కులస్తులకు ఉదారంగా ఆర్థిక సహాయం అందించాలి. తాటి, ఈత వనాలపై ఆధారపడిన గౌడ కులస్తులు సాయం చేయాలి. పంటల నాణ్యత లోపించి నష్టపోతున్న రైతులకు ఆర్థిక సహాయం చేయాలి. ఈ ప్రాంతంలోని కులవృత్తుల జీవనోపాధికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. నాలుగైదు గ్రామాలకు ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అందులో తప్పనిసరిగా మహిళాశిశు, చర్మవ్యాధుల వైద్యులు ఉండాలి. ‘మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు’ కోసం నియమించిన మంత్రుల సబ్‌కమిటీ దృష్టికి తీసుకువచ్చిన ఈ విషయాలను సానుకూలంగా పరిశీలిస్తారని, మూసీ పరీవాహక గ్రామాల ప్రజల కష్టాలు తీర్చే దిశగా ఆలోచిస్తారని మేం ఆశిస్తున్నాం.
బట్టె శంకర్, మూసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు;
బాలరాజ్ గౌడ్, గౌడ సంఘం; చిలువేరి ఐలయ్య, యాదవ సంఘం;
గుండోళ్ల లింగస్వామి, శాలివాహన సంఘం; పూలమోని బస్వయ్య, ముదిరాజ్ సంఘం; సిరిపని ఐలయ్య, దళిత సంఘం (ఎమ్మార్పీఎస్); మల్యాల బాలయ్య, నాయీబ్రాహ్మణ సంఘం.






