తేదీలు తారుమారు
సినిమా పూర్తయ్యాక విడుదల తేదీ ఎంపిక చేయడం నుండి సినిమా ఖాయమనుకున్న నాడే విడుదల తేదీపై ఒక నిర్ణయం తీసుకునే రోజులొచ్చాయి. ఈ మేరకు చిత్ర వర్గాల నుంచి అధికారిక ప్రకటన కూడా వస్తుండటం చూస్తునే ఉన్నాం. అయినప్పటికీ కొన్నిసార్లు సినిమా లు థియేటర్లకి వచ్చే విషయంలో దోబూచులాట జరుగుతూనే ఉంది. ఎన్ని ప్రణాళి కలు వేసుకున్నా అనుకోని ఘటనలు సిని మా విడుదలపై ప్రభావం చూపిస్తుంటా యి. ఫలితంగా సినిమా విడుదల తేదీలు తారుమారవుతుంటాయి. ఇటీవల కాలం లో విడుదలకి సంబంధించి వార్తల్లో నిలిచిన సినిమాలపై ఓ లుక్కేస్తే..
వీటిలో నేడు విడుదలకానున్న ‘హరోం హర’ గురించి ముందుగా చెప్పుకుంటే.. సుధీర్ బాబు కథానాయకుడిగా జ్ఞానసాగర్ తెరకెక్కించిన ఈ సినిమా మే 31 విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమాకి సంబంధించిన డి.ఐ. పనులు నాలుగు రోజులు ఆలస్యమయ్యాయి. దాని మూలాన సినిమా విడుదల రెండు వారాలు వెనక్కి వెళ్ళింది. మే 31న విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా సైతం వాయిదాల పర్వం దాటుకునే థియేటర్‌లోకి వచ్చింది. ఇదే నెల ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కూడా ఈ జాబితాలో ఉంది. వైజయంతి మూవీస్ సంస్థలతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ సినిమా పూర్వ నిర్మాణ కార్యక్రమాల జాప్యంతో జూన్ 27కి వచ్చి చేరింది. కాగా ఈ నెల ఆరంభంలోనే జూన్‌ని ‘కల్కి మంత్’గా అభివర్ణించింది చిత్ర బృందం. ఈ ఏడాది ప్రథమార్థంలో సినీ వినోదంలో ఏర్పడిన లోటుని తీర్చగలిగే సత్తా ‘కల్కి’కే ఉందని అంతా భావిస్తున్నారు.
జూలై 12న తెరమీదికి రానున్న ‘భారతీయుడు 2’ సినిమాతో ద్వితీయార్థం మొదలుకానుంది. శంకర్ హాసన్ కలయికలో రెండు దశబ్దాల తర్వాత వస్తన్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. 2019లో మొదలైన ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. తద్వారా సినిమా విడుదల ఆలస్యమైంది. మొన్నటికి మొన్న తన 50వ చిత్రమైన ‘రాయన్’ను కూడా వాయిదా వేశారు ధనుష్. ఆయన కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా జూన్ 13 నుండి జూలై 26కి మారింది. ప్రస్తుతానికి జూలై నెలలో చెప్పుకోదగ్గ సినిమాలివే. మరికొన్ని వచ్చే అవకాశమూ లేకపోలేదు.
ఆగస్టులో ‘పుష్ప’గా అల్లు అర్జున్ సందడి షురూ అవుతుందని ముందు నుండి అనుకుంటున్నదే. ఆగస్టు 15న ‘పుష్ప: ది రూల్’ విడుదల చేయనున్నామని రెండొందల రోజుల ముందే ప్రకటించాయి చిత్ర వర్గాలు. ఆ దిశగానే చిత్రీకరణ సహా ఇతర సినిమా వ్యవహారాలు సాగుతున్నాయి. అయితే బాలీవుడ్ చిత్రాలైన ‘సింగమ్ ఎగైన్’, ‘ఖేల్ ఖేల్ మే’ చిత్రాలు కూడా ఇదే తేదీ పైన కన్నేశాయి. మరోవైపు విక్రమ్ నటించిన తమిళ చిత్రం ‘తంగలాన్’ కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజే విడుదల కానుందిట. ఈ పరిస్థితులలో దేశ వ్యాప్తంగా థియేటర్లని రూల్ చేయాలనుకుంటోన్న ‘పుష్ప’ వెనక్కి వెళ్ళే అవకాశముం దని కథనాలు వెలువడుతున్నాయి.
సెప్టెంబర్ 27.. ప్రస్తుతం సినీ పరిశ్రమ అంతా ఈ తేదీ చుట్టూనే తిరుగుతోంది. దీనికి కారణం దసరా సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ రావడం. మొట్ట మొదట ఈ తేదీని లాక్ చేసింది ‘ఓజీ’ సినిమానే అయినప్పటికీ, ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది. ఎన్నికల హడావుడి నుండి బయటపడిన పవన్ ముందుగా ‘హరి హర వీర మల్లు’ సినిమాని ముందుగా పూర్తి చేయనున్న నేపథ్యంలో ‘ఓజీ’ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. మధ్యలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చి చేరితే, ‘ఓజీ’ రాక 2025లోనే ఉంటుంది. ఈ సినిమాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇదే అవకాశంగా భావించిన ‘దేవర’ దర్శక నిర్మాతలు తమ సినిమాని రెండు వారాల ముందుగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘దేవర’ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘లక్కీ భాస్కర్’ సైతం ఇదే రోజు రానుండగా, బాలకృష్ణ 109వ సినిమా, రవితే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలకి సైతం ఈ తేదీనే పరిశీలిస్తున్నారు చిత్ర నిర్మాతలు. ‘దేవర’ ముందుకొచ్చినందన వీటిలో ఏవైనా వాయిదా పడతాయా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అక్టోబర్‌లో ‘వేట్టయాన్’ రాక ఇప్పటికే ఖరారవ్వగా, ప్రస్తుతం తుది చిత్రీకరణలో ఉన్న ‘డబుల్ ఇస్మార్ట్’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు విడుదల తేదీకై వేచి చూస్తున్నాయి.






