16 July, 2026 | 2:42 PM

డెకాయిట్ సెట్‌లో..

14-06-2024 12:05 AM

అడవి శేష్ కథ, స్క్రీన్ ప్లే సహకారం అందిస్తూ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు షానీల్ డియో మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మాత కాగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్న పాత్రలకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను, పోరాటాలను చిత్రీకరిస్తున్నారు. కాగా, తాజాగా శృతిహాసన్ గురువారం సెట్‌లో అడుగుపెట్టింది.

ఈ సందర్భంగా హీరో అడవి శేష్‌తో తీసుకున్న సెల్ఫీని శృతి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాను ఒకేసారి హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ‘డకాయిట్’ అనే పదానికి ‘సాయుధ దొంగల ముఠా సభ్యుడు’ అని అర్థం ఉంది. తమ జీవితాలను మార్చుకునే ఆలోచనతో ఇద్దరు మాజీ ప్రేమికులు వరుస దోపిడీలు చేసేందుకు ఎలా ఏకమయ్యారో తెరపై చూపించనున్నామని చిత్రబృందం తెలిపింది.