31 March, 2026 | 1:58 AM

డబుల్ లైన్ల రూపంలో పొంచి ఉన్న మృత్యువు

31-03-2026 12:27 AM
  1. విద్యుత్ సరఫరా లైన్లో ఒకదానిపై ఒకటి

శ్రీగిరిపల్లి ఘటనకు అదే కారణమా 

కోళ్ల ఫారం జనరేటరా 

ఘటన మరుసటి రోజే లైన్లు మార్చిన అధికారులు 

గజ్వేల్ డివిజన్లో అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి 

ఇంకా ఎన్ని ప్రాణాల ఖరీదు కట్టాలో

గజ్వేల్, మార్చి30: డబుల్ లైన్ల రూపంలో విద్యుత్ శాఖ సిబ్బందికి మృత్యువు పొంచి ఉంటుంది. గజ్వేల్ మండలం శ్రీగిరి పల్లి శివారులో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదానికి ఒక లైన్ పై నుండి వెళ్తున్న మరో లైన్ ద్వారా విద్యుత్ ప్రసారం జరగడం కారణం కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటివరకు అధికారికంగా దీనిని ధ్రువీకరించకపోయినా ఒక దానిపై ఒకటిగా ఉన్న లైన్లను ప్రమాదం జరిగిన వెంటనే మార్చి వేశారు.

ఈ విధంగా ఆ ఒక్క చోటే కాదు డివిజన్లోని అన్ని మండలాల్లో విద్యుత్ లైన్ల పై మరో విద్యుత్ లైన్లు వేసి విద్యుత్ సరఫరాను కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగితే ఇంకా ఎంతమంది ప్రాణాలకు ఖరీదు కట్టాల్సి వస్తుందో అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  1. ప్రమాదానికి కారణం ఏమిటి? 
  2. కోళ్ల ఫారం జనరేటరా?
  3. ఒకదానిపై ఒకటిగా ఉన్న విద్యుత్తులైన్లా?

శ్రీగిరి పల్లి వద్ద విద్యుత్ లైన్ సరిచేస్తుండగా మీటర్ రీడర్ బాబు మృతి చెందాడు. ఎల్ సి తీసుకున్న విద్యుత్ లైన్ లో మరమ్మత్తులు చేస్తుండగానే విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. లైన్ మెన్ గా పనిచేస్తున్న ఆర్టిజన్ అనారోగ్యం కారణంగా మీటర్ రీడర్ బాబు పనిచేసి ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో ఎల్ సి తీసుకున్న విద్యుత్ లైన్ పై నుండి వెళ్తున్న మరో విద్యుత్ లైన్ ద్వారా విద్యుత్ ప్రసారం జరిగి షాక్ తగిలి ఉండవచ్చని, అదే లైన్ కు వేరే వైపు నుండి విద్యుత్ సరఫరా జరిగి ఉండవచ్చని, విభిన్నమైన కారణాలను చెబుతున్నారు.

పలువురు అనుభవం ఉన్న లైన్మెన్లను, విద్యుత్ టెక్నీషియన్లను ఈ విషయమై సంప్రదించగా మరమ్మతు చేస్తున్న విద్యుత్తు లైను ద్వారా సమీపంలోని శ్రీవత్స కోళ్ల ఫారానికి విద్యుత్ సరఫరా జరుగుతుందని, పెద్ద కోళ్ల ఫారం కావడం వల్ల అక్కడ జనరేటర్ వినియోగం కచ్చితంగా ఉంటుందని, మరమ్మత్తుల సమయంలో జనరేటర్ ను అక్కడి సిబ్బంది స్టార్ట్ చేయడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ ప్రకారంగానే ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు కూడా తెలిపారు. కానీ ఇప్పటివరకు అధికారులు మాత్రం ప్రమాదం జరగడానికి అసలైన కారణాన్ని నిర్ధారించకపోవడం గమనార్హం. ఎల్ సి తీసుకున్న విద్యుత్ లైన్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసే లైన్ కావడంతో ఈ లైన్ లో ఎవరైనా జనరేటర్ ను వినియోగిస్తే ఈ ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉందన్న కోణంలో అధికారులు ఎందుకు విచారణ చేయడం లేదు?

ప్రమాదం జరిగిన వెంటనే ఒకదానిపై ఒకటిగా ఉన్న విద్యుత్ లైన్లను ఎందుకు మార్చారు?. ప్రమాదం జరగడానికి కారణం ఎవరు?. ఇలా అసలైన సమాధానం కోసం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితోపాటు సమీప గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. విద్యుత్ ప్రమాదానికి డబుల్ లైన్లే కారణమైతే గజ్వేల్ డివిజన్లో మరిన్ని ప్రమాదాలు జరుగుతాయో అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. డబుల్ లైన్ లో విషయంలో ఇప్పటికైనా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.