calender_icon.png 16 October, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యార్థి మృతిపై ప్రమాదం ముద్ర!

16-10-2025 12:06:26 AM

-నిజాన్ని తొక్కిపెడుతున్న   అడుగులు..?

-ప్రమాదవశాత్తు మరణమేనన్న మంత్రి పొన్నం ప్రభాకర్

-దానిని రాజకీయం చేయొద్దని హితవు

-దర్యాప్తు దిశను నిర్దేశించేలా వ్యాఖ్యలు?

-మిస్టరీ ముగింపు కోసం ముందస్తు తీర్పు

హుస్నాబాద్, సెప్టెంబర్ 15 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని జిల్లెలగడ్డ  సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి సనాదుల వివేక్ (13) అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతుండగానే, రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. వివేక్ మరణం ప్రమాదవశాత్తు జరిగింది అని తేల్చి చెప్పడం, దానిని రాజకీయం చేయవద్దని హితవు పలకడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆదేశించాల్సిన మంత్రి, దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉండగానే ఒక నిర్ధారణకు రావడం పోలీసుల దర్యాప్తు దిశను పరోక్షంగా ప్రభావితం చేయడమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. బుధవారం మంత్రి  పాఠశాలలో సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్ ఆయనకు కారిడార్ లోని రెయిలింగ్ కు కట్టి ఉన్న నైలాన్ తాడు ఫొటోలను సెల్ ఫోన్లలో చూపించారు. 

మంత్రి వ్యాఖ్యలతో దర్యాప్తుపై  ప్రభావం?

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, వివేక్ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నైలాన్ తాడు మెడకు చుట్టుకుందని, ఈ విషయం తనకు అక్కడున్న ఒక విద్యార్థి చెప్పాడన్నారు. ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇదే విషయం తేలిందన్నారు.  ఇది తన అభిప్రాయమని కూడా ఆయన చెప్పడం గమనార్హం. అయితే సంఘటనా స్థలం పరిస్థితులు, వివేక్ తండ్రి ఆరోపణలు, ఉపాధ్యాయుల వాదనల్లోని వైరుధ్యాలు మరణంపై అనేక ప్రశ్నలను లేవనెత్తడంతోపాటు .మంత్రి వాదనను బలహీనపరుస్తున్నాయి.

ప్రమాదంపై సందేహాలు : ప్రమాదవశాత్తు మెడకు తాడు చుట్టుకుంటే, అక్కడున్న వారు ఎందుకు కాపాడలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ప్రమా దమే జరిగితే, పక్కనే ఉన్నవారు లేదా ఉపాధ్యాయులు వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడే అవకాశం లేదా? కొద్ది నిమిషాల్లోనే ప్రాణం పోయేంత తీవ్రత ఏర్పడుతుందా? ప్రమాదం జరిగితే, వెంటనే కేకలు వినిపించేవని, పక్కనున్నవారు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చేవారని చెబుతున్నారు. ఈ సందేహాలు మంత్రి చెబుతున్న ’ప్రమాదం’ అనే వాదనను కొట్టి పారేస్తున్నాయి. నిమిషాల వ్యవధిలో మెడకు తాడు బిగుసుకుని ఉరి పడేంత చర్య జరగడం అసాధ్యమని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు మొదటి నుంచీ మొత్తుకుంటున్నారు.

తాడు ఎత్తు : క్లాస్ రూమ్ కారిడార్లో నైలాన్ దారం కట్టిన ఎత్తు, దానికి విద్యార్థి ఉరి బిగుసుకునేంత అవకాశం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మంత్రి చెప్పినట్లుగా ప్రమాదవశాత్తు తాడు చుట్టుకోవడమనేది అసాధ్యం, హాస్యాస్పదంగా కనిపిస్తోందని వివేక్ బంధువులు ఆరోపిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలు పోలీసు దర్యాప్తును కేవలం ప్రమాదవశాత్తు మరణం అనే ఒకే కోణంలోకి పరిమితం చేసేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య, హత్య అనే కీలకమైన కోణాలను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలను ఈ వ్యాఖ్యలు మరింత బలపరుస్తున్నాయి.

నిజాలు తొక్కిపెట్టే ప్రయత్నం ఎందుకు?

వివేక్ మరణానికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక, పోలీసుల క్షుణ్ణమైన దర్యా ప్తులో వాస్తవాలు వెల్లడవుతాయి. అలాంటిది, మంత్రి కేవలం ఒక విద్యార్థి చెప్పిన మాటల ఆధారంగా, అది కూడా దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు, ఒక ముందస్తు తీర్పు ఇవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది.

ఉపాధ్యాయుల పాత్ర : వివేక్ కింద పడ్డాడని మాత్రమే చెప్పి, మెడకు తాడు బిగుసుకున్న కీలక విషయాన్ని ఉపాధ్యాయులు ఎందుకు దాచిపెట్టడానికి ప్రయ త్నించారు? వారి నిర్లక్ష్యం లేదా పాత్రపై అనుమానాలు ఉన్నప్పుడు, మంత్రి ఈ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఉపాధ్యాయులు సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారనే ఆరోప ణలు బలంగా ఉన్నప్పుడు, మంత్రి కేవలం ’ప్రమాదం’ అని చెప్పడం, ఉపాధ్యాయుల ఘోర నిర్లక్ష్యం, ఇతర పాత్రపై దృష్టి మళ్లకుండా చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది.

పేద విద్యార్థి కుటుంబానికి అన్యాయం : పేద కుటుంబానికి చెందిన వివేక్ తల్లిదండ్రులకు తమ కొడుకు ఎలా చనిపోయాడో తెలుసుకునే హక్కు ఉంది. మంత్రి ప్రకటన వారి హక్కును, న్యాయం పొందే అవకాశాన్ని అడ్డుకుంటున్నట్లుగా ఉందని అంటున్నారు. గురుకులంలో విద్యార్థి భద్రతపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా ఉన్నప్పటికీ, మంత్రి వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దర్యాప్తును నిర్వీర్యం చేయడానికేనా?: 

మంత్రి వ్యాఖ్యల కారణంగా, పోలీసులు హత్య లేదా ఆత్మహత్య కోణాలను పక్కన పెట్టి, కేవలం ’ప్రమాదం’ అనే కోణంలోనే ఆధారాలు సేకరించి, కేసును తొందరగా ముగించే ప్రమాదం ఉంది. అంటే, మంత్రి వ్యాఖ్యలు దర్యాప్తు దిశను నిర్వీర్యం చేయడానికేనా

‘ప్రజా ప్రభుత్వం’ జవాబుదారీ లేదా?: 

పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, పోలీసు విచారణ పూర్తికాకముందే ఒక నిర్ధారణకు రావడం, ఆ తల్లిదండ్రులకు న్యాయం దూరం చేయడమే. నిజాలను తెలుసుకునే హక్కును పేద విద్యార్థి కుటుంబానికి నిరాకరించడం ప్రజా ప్రభుత్వ లక్ష ణం అవుతుందా? మంత్రి వ్యాఖ్యలు గురుకులంలో విద్యార్థుల భద్రతను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చాయి.

కేసులో పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే, మంత్రి మాటల ప్రభావం లేకుండా, పోలీసులు స్వతంత్రంగా, పారదర్శకంగా దర్యాప్తును కొనసాగించడం తక్షణావసరం. హత్యా? ఆత్మహత్యా? ప్రమాదవశాత్తూ? అనే మిస్టరీ తేలేదాకా, వివేక్ తల్లిదండ్రులు ఆందోళన చెందడం, ప్రజా సంఘాలు నిరసన తెలపడం కొనసాగుతూనే ఉంటుంది.

న్యాయం జరగాలంటే, మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించడానికి పోస్టుమార్టం నివేదిక, సంఘటన జరిగిన ప్రదేశంలోని ఆధారాలు, తోటి విద్యార్థుల వాంగ్మూలాల మధ్య పొంతన తేలడం కీలకం. మంత్రి వ్యాఖ్యల కారణంగా దర్యాప్తు అధికారులు కేవలం ప్రమాదం అనే కోణంలోనే ఆధారాలను సేకరించి, వాస్తవాలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చి, వివేక్ కుటుంబానికి న్యాయం జరిగేలా నిష్పక్షపాతమైన దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉంది.