calender_icon.png 16 October, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విస్తరణ సరే.. లింకు రోడ్లేవీ?

16-10-2025 12:03:08 AM

-రహదారిపై కనిపించని సూచిక బోర్డులు

-ముండ్రాయి, రాంపూర్ క్రాస్ రోడ్లు ప్రమాదాలకు నిలయం

నంగునూరు, అక్టోబర్ 15 : సిద్దిపేట, హనుమకొండ రాజీవ్ రహదారి విస్తీరణ నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ, రహదారికి అనుసంధానంగా ఉండే లింక్ రోడ్లు గుంతలు, కంకర తేలి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ ఆలస్యానికి నిదర్శనమని వాహనదారులు మండిపడుతున్నారు.

నాలుగేళ్ల కిందట ప్రారంభించిన పనులలో ప్రధాన రహదారులు మాత్రమే పూర్తి చేసి, గ్రామాలు, మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లతో పాటు ముండ్రాయి, బద్దిపడగ, రాంపూర్ క్రాస్ రోడ్లను మరమ్మతులు చేయకుండా విస్మరించారు. దాంతో  వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిల వద్ద తారు రోడ్డును ఆనుకొని సీసీ రోడ్డు లేకపోవడంతో జాయింట్ల వద్ద పెద్ద గుంతలు ఏర్పడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

లింక్ రోడ్లకు..

రహదారి విస్తీర్ణంతో ప్రయాణం సులభతరం అవుతుందని ఆశించిన నంగునూరు మండలంలోనీ గ్రామాల ప్రజలకు లింక్ రోడ్ల ఇబ్బందులు తప్పడం లేదు. నంగునూరు మండల కేంద్రంతో పాటు 12 గ్రామాలకు రహదారి అయిన రాంపూర్ క్రాసింగ్ వద్ద నిర్మాణం అసంపూర్తిగా ఉండటం ప్రమాదాలకు నిలయంగా మారిందని మండిపడుతున్నారు.  ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక, హైవేపై వేగంగా వెళ్లే భారీ వాహనాల వల్ల తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

కనిపించని సూచిక బోర్డులు..

ప్రమాదకరమైన మలుపులు, క్రాస్ రోడ్ల వద్ద కనీసం ప్రమాద సూచిక, హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది. వర్షం నీరు నిలిచి ఉండటం, రాత్రి వేళల్లో సరియైన వెలుతురు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

రహదారి పనులు పూర్తయినా...  ముండ్రాయి, పాలమాకుల, బద్దిపడగ క్రాస్ రోడ్ల వద్ద లింక్ రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది. అధిక సంఖ్యలో గ్రామాల ప్రజలు నిత్యం ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. అధికారులు తక్షణమే కళ్లు తెరిచి, యుద్ధ ప్రాతిపదికన మూలమలుపుల వద్ద మరమ్మతు పనులు చేపట్టాలి. ప్రమాదాలను నివారించేందుకు తక్షణమే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి.

 బెదురు తిరుపతి, సిద్ధన్నపేట గ్రామస్తుడు

సంతోషించాం.. కానీ భయపెడుతున్నాయి..

ఈ హైవే విస్తరించిన తర్వాత మా ప్రయాణం సులభం అవుతుందని సంతోషించాం. ఇప్పుడు ప్రధాన రహదారి కంటే ఈ లింక్ రోడ్లే మమ్మల్ని భయపెడుతున్నాయి. రాంపూర్ క్రాస్ రోడ్డు వద్ద దారుణం. రోడ్డును తవ్వి వదిలేశారు. రాత్రిపూట కరెంట్ ఉండదు, సూచిక బోర్డులు లేవు. అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి. 

 పరుశరాములు, రాంపూర్ గ్రామస్తుడు