8 July, 2026 | 1:33 AM

38 మందికి మరణశిక్ష

08-07-2026 01:10 AM
  1. 11 మందికి యావజ్జీవం
  2. అహ్మదాబాద్ హైకోర్టు తీర్పు, కింది కోర్టు తీర్పు సమర్థన
  3. బాధితులకు 2027 మార్చిలోగా పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం

గాంధీనగర్, జూలై 7: అహ్మదాబాద్ 2008 పేలుళ్ల కేసులో 38 మందికి మరణశిక్ష, 11 మందికి యావజ్జీవ శిక్ష సరైందేనని అహ్మదాబాద్ హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది. దిగువకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి మంగళవారం దోషులకు శిక్షను ఖరారు చేసింది. జస్టిస్ ఏవై కోగ్జే, సమీర్ దవేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దిగువకోర్టుకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లను కొట్టివేసింది. ఐఎం (ఇండియన్ ముజాహిదీన్)తో సంబంధం ఉన్న వ్యక్తుల శిక్షలను కోర్టు సమర్థించింది.

మృతిచెందిన వారి 56 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన 200 మందికి పైగా కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున పరిహారం అందించాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిహారాన్ని 2027 మార్చి 30లోగా చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. 18ఏళ్లు సుధీర్ఘంగా కొనసాగుతున్న ఈ కేసులో 1100 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయగా, 6వేలకు పైగా పత్రాలను కోర్టుకు సమర్పించారు. మొత్తం 3,47,800 పేజీల 547 చార్జీషీట్లు దాఖలు చేయగా, అందులో ప్రధాన చార్జీషీట్ ఒక్కటే 9,800 పేజీలుగా ఉంది. 2008 జూలై 26న అహ్మదాబాద్‌లో 70 నిమిషాల వ్యవధిలో 14 ప్రదేశాలలో 21 బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో 56 మంది మరణించగా 200 మందికి గాయాలయ్యాయి.