8 July, 2026 | 12:47 AM

కేపీహెచ్‌బీలో తగ్గనున్న ఓట్లు..

08-07-2026 12:00 AM
  1. పెయింగ్ గెస్ట్ హాస్టల్‌లలో ఎస్‌ఐఆర్‌కు స్పందన కరువు
  2. గల్లంతు కానున్న సుమారు 25 వేల ఓట్లు

కూకట్‌పల్లి, జులై 7 (విజయక్రాంతి): కూకట్‌పల్లి నియోజకవర్గం హౌసింగ్ బోర్డ్ కాలనీ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)తో భారీగా ఓట్లు తగ్గనున్నాయి. కేపిహెచ్‌బి కాలనీ, బాలాజీ నగర్ డివిజన్‌లలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా బిఎల్‌ఓ లు ఎన్యుమరేషన్ పత్రాలను ఓటర్లకు అందించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

గతంలో ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు అందుబాటులో లేకపోవడం, వారందరి అడ్రస్ లు అన్ని పెయిన్ గెస్ట్ హాస్టల్ లలో నమోదయి ఉండడం తో బి ఎల్ ఓ లు తలలు పట్టుకుంటున్నారు.. అందులో కొందరు స్థానికంగా అందుబాటులో ఉన్నప్పటికీ ఎన్యుమరేషన్ పత్రాలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. 

గడువులోపు 100 శాతం ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పూర్తిచేయాలని పై అధికారుల ఒత్తిడి ఒకవైపు, హాస్టల్ ల లోని ఓటర్లు అందుబాటులో లేకపోవడం స్థానికంగా ఉన్న కొందరు ఇక్కడ ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో బి ఎల్ ఓ లు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పీజీ హాస్టల్‌లలో ఇన్ని వేల ఓట్లు ఎక్కడివి?

పెయిన్ గెస్ట్ హాస్టళ్లకు నగరంలో పేరెన్నిక గల ప్రాంతంగా కెపిహెచ్ బి కాలనీకి ప్రత్యేక గుర్తింపు కలదు. హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో ఉండడం దీనికి మరొక కారణం. దీంతో కెపిహెచ్ బి కాలనీలో సుమారు 500 పెయింగ్ గెస్ట్ హాస్టల్ లు ఏర్పడ్డాయి.ఉద్యోగ నిమిత్తం, చదువు నిమిత్తం నగరానికి వచ్చి హాస్టళ్లలో నివాసం ఉంటున్న చాలామందిని గతంలో కొందరు రాజకీయ నాయకులు ఓటర్లుగా నమోదు చేయించి తమకు అనుకూలంగా మలుచుకున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన స్థానిక నాయకులు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా  తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల మందిని హాస్టళ్ల అడ్రస్ తో ఓటర్లుగా నమోదు చేయించినట్లు తెలుస్తోంది.   ఎస్ ఐ ఆర్ ప్రక్రియలు భాగంగా ఒకే చోట ఓటు హక్కు కలిగి ఉండాలనే నిబంధన లో భాగంగా తమ స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

దీంతో హాస్టల్లోని ఓటర్లు కేపీహెచ్ బి లో  ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఇష్టపడడం లేదన్నట్టు తెలుస్తుంది. కే పి హెచ్ బి కాలనీ, బాలాజీ నగర్ డివిజనుల పరిధిలో సుమారు 500 హాస్టల్ ఉండగా ప్రతి హాస్టల్ నుండి 50 నుంచి 100ఓట్లు ఈ సమస్యతో తొలగిపోతున్నట్లు తెలుస్తుంది.

దీంతో కెపిహెచ్ బి, బాలాజీ నగర్ డివిజన్ లలోనే సుమారు 25 వేల ఓట్లు తొలగిపోనున్నట్లు సమాచారం. ఇది రాబోయే ఎన్నికలలో నాయకుల గెలుపు ఓటమిలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో రాజకీయ విశ్లేషకుల మధ్య ఈ విషయంపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది.