8 July, 2026 | 2:00 AM

ఏడో విడత రైతుభరోసా

08-07-2026 01:19 AM
  1. ఎనిమిది ఎకరాల వరకు పెట్టుబడి సాయం
  2.    58,831 మంది రైతుల ఖాతాల్లో రూ.259.73 కోట్లు జమ
  3. మంత్రి తుమ్మల వెల్లడి 
  4.    10న మధిరలో రైతు ఆశీర్వాద సభ

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద ఏడో విడతలో 7 నుంచి 8 ఎకరాలకు వరకు సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో 259.73 కోట్లు జమ చేసింది. 58,831 మంది రైతులు, 4.32 లక్షల ఎకరాల సాగుభూమికి గానూ పెట్టుబడి సాయం నిధులు విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  వెల్లడించారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా దశల వారీగా రైతుభరోసా నిధులను విడుదల చేస్తున్నామని చెప్పారు. ఏడు విడతల్లో 68.96 లక్షల మంది రైతులు, 129.17 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.7,750.45 కోట్ల సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.  

కృతజ్ఞతగా రైతు ఆశీర్వాద సభ..

అర్హులైన ప్రతి రైతుకూ ‘రైతుభరోసా’ అందజేస్తున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.  రైతులకు సకాలంలో పెట్టుబడి సా యం అందజేసినందుకు కృతజ్ఞతగా ఈ నెల 10న ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం చింతకాని మండలంజగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ  ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిపా రు.

రైతు ఆశీర్వాద సభ జూన్ 30న మదిరలో జరగాల్సి ఉండగా, వాతావారణ పరిస్థితులు అనుకూలించక హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, రైతుభరోసా నిధులను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10న భారీ జనసమీకరణతో రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.