క్షీణిస్తున్న మానవ సంబంధాలు
ప్రతిరోజు కొత్త సాంకేతిక విప్లవంతో ప్రపంచం వెలిగిపోతుంటే మనిషి మనసులో చీకటి పెరుగుతోంది. ఒకప్పుడు మనం అనే వాళ్లం. ఇప్పుడు నేను, నాది అనే స్వార్థం, పోటీ, ప్రదర్శన మానవ సంబంధాలను క్షీణింపజేశాయి. ప్రేమకు బదులు ప్రయోజనం, ఆప్యాయతకు బదులు ఆర్థిక లావాదేవీ, సహాయం స్థానంలో స్వార్థం చేరుకుంది. ప్రతి మనిషి జీవితానికి ఆధారం ప్రేమ, అనుబంధం, ఆప్యాయత.
ఇవే మనిషిని ‘మనిషిగా’ నిలబెట్టే విలువలు. కానీ నేటి సమాజం మాత్రం మానవీయ విలువలు కోల్పోయింది. అభివృద్ధి పరుగులో మనం డబ్బు సంపాదించుకుంటూ సౌకర్యాలు పెంచుకుంటున్నాం, కానీ మన పక్కనున్న మనిషిని కోల్పోతున్నాం. ఈ యాంత్రిక జీవనంలో మానవ సంబంధాల విలువలు తగ్గిపోవడం ఒక విషాదం. మానవ సంబంధాలు మాయమవ్వడం అనేది కేవలం సామాజిక మార్పు కాదు అది మనసుల మరణం. ఈ మరణాన్ని ఆపగలిగేది మనం మాత్రమే. మనమందరం మళ్లీ మనుషులుగా’ మారుదాం.
మాటల కంటే మమత, ఫోటోల కంటే ఫీలింగ్, లైక్స్ కంటే లవ్ విలువైనవని గుర్తుంచుదాం. మన జీవితంలో నిజమైన సంతోషం ఎక్కడ ఉందో మనం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులను భాద్యత భారంగా కాకుండా ప్రేమగా, స్నేహితుడి కష్టంలో అండగా ఉందాం.
ప్రతి గుండెలో ఆప్యాయత, కరుణ, ప్రేమ జ్వాలలు వెలిగితే ఈ ప్రపంచం మళ్లీ మనుషుల తోటగా మారి సుగంధాలను వెదజళ్ళుతుంది.డబ్బు దేహానికి ఆహారం, బంధం ఆత్మకు ఆహారం. ఈ బంధాలే మనకు చివరి వరకు తోడుంటాయి. మాయమవుతున్న ఈ అనుబంధాలను మనం తిరిగి సాధిస్తేనే సమాజంలో శాంతి, ఆనందం వెల్లివిరుస్తాయి. మాయమవుతున్న మానవ సంబంధాలను తిరిగి పునరుద్దరిద్దాం.
సుచిత్ర మొగిలి, కామారెడ్డి






