11 July, 2026 | 12:50 PM

రైతు ఆశీర్వాద సభ కాదు... పచ్చి అబద్ధాల సభ

11-07-2026 11:47 AM

విలేకరుల సమావేశంలో మండిపడిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ 

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన "రైతు ఆశీర్వాద సభ" కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక పచ్చి అబద్ధాల సభ అని, రైతులను ఆశీర్వదించడానికి కాదు, వారిని వంచించడానికి పెట్టిన సభ అని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మంత్రులు వేదికపై చెప్పినవన్నీ ఒట్టి బూటకపు మాటలేనని ఆయన కొట్టిపారేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఓ ప్రకటనలో, ఈ విధంగా మాట్లాడారు. రైతు భరోసా, రుణ మాఫీ అంతా దగా – మాట తప్పిన కాంగ్రెస్: "కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతాంగాన్ని నట్టేట ముంచింది. ఎకరాకు రూ. 15,000 ఇస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి, ఇప్పుడు దాన్ని ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తోంది. గత తొమ్మిది రోజుల్లో రూ. 7,491 కోట్లు ఇచ్చామంటూ రేవంత్ రెడ్డి గారు చెబుతున్న లెక్కలన్నీ కాగితాలకే పరిమితం. క్షేత్రస్థాయిలో ఏ ఒక్క రైతు పూర్తిస్థాయిలో లబ్ధి పొందలేదు. బ్యాంకుల్లో వేల కోట్ల రుణ మాఫీ చేశామని చెబుతున్నా, రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల సాకుతో సగానికి పైగా రైతులను రుణ మాఫీకి దూరం చేశారు. కేసీఆర్ గారి హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో పడ్డ 'రైతు బంధు' నిధులను నిలిపివేసి, రైతులను భిక్షగాళ్లలా మార్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదే."

అస్తవ్యస్తమైన విద్యుత్, రెవెన్యూ వ్యవస్థలు: "కేసీఆర్ పదేళ్ల సువర్ణ పాలనలో తెలంగాణ రైతాంగం 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను కళ్లారా చూసింది. రాత్రిపూట బావుల వద్దకు వెళ్లే తిప్పలు తప్పాయి. కానీ ఈ కాంగ్రెస్ 11 నెలల తుగ్లక్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అంధకారం నెలకొంది. లో-వోల్టేజ్ సమస్యలతో మోటర్లు కాలిపోతున్నాయి. ఇక ధరణి పోర్టల్‌ను రద్దు చేసి 'భూమాత' పేరుతో కాంగ్రెస్ తెస్తున్న మార్పులు కేవలం భూ కబ్జాలకు, పైరవీకారులకు దారులు వేయడానికే. ఈ-పాస్‌బుక్కుల పేరుతో సామాన్య రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారు."

కాళేశ్వరం, మేడిగడ్డపై కుట్రపూరిత రాజకీయం: "తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనం. స్వల్ప సాంకేతిక లోపంతో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగితే, దాన్ని బాగు చేసి రైతులకు నీరివ్వడం చేతగాక, కాంగ్రెస్ ప్రభుత్వం పగటి రాజకీయాలు చేస్తోంది. వరద నీటిని సముద్రం పాలు చేస్తూ, ప్రాజెక్టును ఎండబెట్టి రైతులను కరువులోకి నెడుతున్నారు. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టబట్టే పదేళ్లపాటు తెలంగాణలో కోటి ఎకరాల మాగాణం సాధ్యమైంది. రైతులు పండించిన ప్రతి గింజా కేసీఆర్ గారి విజన్ వల్లే సాధ్యమైంది తప్ప, ఈ కాంగ్రెస్ చేతకానితనం వల్ల కాదు."

అహంకారం కాంగ్రెస్ నేతలదే – ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం: "కేసీఆర్ ఫామ్‌హౌస్ గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, తాము సెక్రటేరియట్‌ను వదిలి కేవలం ఢిల్లీ చుట్టూ మోకరిల్లుతున్న విషయాన్ని మరువరాదు. అప్పుల కుప్ప అంటూ తెలంగాణపై విషం చిమ్ముతూ, మరోవైపు ఆరు గ్యారంటీలను అటకెక్కించారు. ఖమ్మం గడ్డ ఎప్పుడూ మోసాన్ని సహించదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, వారి మోసపూరిత వాగ్దానాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం మరియు ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుంది." అని అన్నారు.