రాజకీయ కక్షతోనే టిమ్స్ ప్రారంభంలో జాప్యం
- అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌ను కూడా అందుబాటులోకి తేవాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కేసీఆర్‌కు పేరొస్తుందన్న రాజకీయ కక్షతోనే టిమ్స్ ఆస్పత్రులను ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌ను కూడా త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించాలన్న సమున్నత ఆశయంతో కేసీఆర్ నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షనీయమని సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ఒక్క సనత్ నగర్ టిమ్స్‌లోనే 1,000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగం, ఎంఆర్‌ఐ, సిటీస్కాన్, ఎక్స్ రే, క్యాథలాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ సెంటర్ వంటి అన్నిరకాల విభాగాలు ఒకేచోట ఉండటం రోగులకు వెలకట్టలేని వరమని పేర్కొన్నారు.
కేవలం హైదరాబాద్ వాసులకే కాకుండా జిల్లాల నుంచి ప్రాణాపాయ స్థితిలో రాజధానికి వచ్చే రోగులకు కూడా ఈ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఒక సంజీవనిగా సేవలందించనుందని, 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చేపట్టిన ఈ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లకు, ఆసుపత్రిలో సేవలందించే వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్‌ఎస్ హయాంలో ప్రాధమిక వైద్యం కోసం రూపకల్పన చేసిన 350 బస్తీ దవాఖానాలతోపాటు, కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించేందుకు 4000 పడకలు, ఆక్సిజన్ వసతి కలిగిన 1200 ఎమర్జెన్సీ బెడ్లు.. పేద రోగులకు కొండంత భరోసా ఇవ్వనున్నాయని వెల్లడించారు. ఇప్పటికైనా రెండు వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్దదైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, హైదరాబాద్ లోని నిమ్స్ విస్తరణ పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






