8 April, 2026 | 3:08 AM

ఢిల్లీని ఆపతరమా?

08-04-2026 01:24 AM

గుజరాత్ టైటాన్స్‌కు అగ్నిపరీక్ష 

సూపర్ ఫామ్‌లో సమీర్ రిజ్వి

బౌలింగ్‌లోనూ అదరగొడుతున్న ఢిల్లీ 

గిల్ రీఎంట్రీతో టైటాన్స్‌కు జోష్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఉత్సాహంగా సాగుతున్న ఐపీఎల్ 19వ సీజన్‌లో బుధవారం ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆసక్తికర సమరం జరగబోతోంది. వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఇప్పటి వరకూ గెలుపు ఖాతా తెరవని గుజరాత్ టైటాన్స్‌తో తలపడబోతోంది. అన్ని విభాగాల్లో మంచి ఫామ్‌లో ఉన్న ఢిల్లీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా సమీర్ రిజ్వీ విధ్వంసకర ఫామ్‌లో ఉన్నాడు. గత రెండు మ్యాచ్ లలోనే అతనే ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

లక్నోపై  కేవలం 47 బంతుల్లో 70 రన్స్ తో నాటౌట్‌గా నిలిచిన సమీర్ రిజ్వీ.. ముంబై ఇండియన్స్‌పై మరింత రెచ్చిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో 51 బంతుల్లో 90 పరుగులు బాదేశాడు. రిజ్వీ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. లక్నోతో మ్యాచ్ లో 4 వికెట్లు కోల్పోయిన తర్వాత అతను ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమనే చెప్పాలి. దీంతో ఢిల్లీ బ్యాటింగ్‌లో అత్యంత కీలకంగా మారిపోయిన రిజ్వీ హోంగ్రౌండ్ రెచ్చిపోవడం ఖాయం. మిగిలిన బ్యాటింగ్ లైనప్ చూస్తే ఓపెనర్ నిస్సాంక కూడా ఫామ్ అందుకున్నాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం ఇంకా ఫామ్‌లోకి రాలేదు.

గత రెండు మ్యాచ్‌లలోనూ నిరాశపరిచాడు. 2025 సీజన్ పరుగుల వరద పారించిన రాహుల్ గుజరాత్‌పై సత్తా చాటాలని ఎదురుచూస్తున్నాడు. అలాగే నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్ ఇంకా పూర్తిస్థాయి విధ్వంసం చూపించలేదు. కెప్టెన్ అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, స్టబ్స్ వంటి వారితో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. అటు బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్ లేకున్నా నటరాజన్, ఎంగిడి అదరగొడుతున్నారు. గత రెండు మ్యాచ్‌లలో అదిరిపోయే ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా భీకరమైన బ్యాటింగ్ ఉన్న ముంబై లాంటి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.

కుల్దీప్ తో పాటు అక్షర్ పటేల్ కూడా రాణిస్తున్నాడు. దీంతో ఏ విధంగా చూసినా సొంతగడ్డపై ఢిల్లీనే ఫేవరెట్‌గా భావిస్తున్నారు.మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో ఇంకా గెలుపు రుచి చూడలేదు. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పై ఓడిన టైటాన్స్ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌పై పరాజయం పాలైంది. సాయిసుదర్శన్ మంచి ఆరంభాన్నిచ్చినా కీలక బ్యాటర్లు విఫలమయ్యారు. బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, తెవాటియా, షారూఖ్‌ఖాన్ వంటి వారంతా చేతులెత్తేశారు.

ఈ సీజన్ ఆరంభం నుంచీ కూడా గుజరాత్‌కు బ్యాటింగ్ వైఫల్యమే మైనస్‌గా మారింది. కాగా గత మ్యాచ్‌కు మెడనొప్పి కారణంగా దూరమైన కెప్టెన్ గిల్ ఢిల్లీపై రీఎంట్రీ ఇస్తున్నాడు. గిల్‌తో పాటు మిగిలిన బ్యాటర్లు రాణిస్తే తప్ప గుజరాత్ గెలుపు ఖాతా తెరవడం కష్టమే. బౌలింగ్‌లో రబాడ, సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ వికెట్లు తీస్తున్నా పరుగులు ఇచ్చేస్తున్నారు. పేస్ ఎటాక్ మరింత కట్టడిగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. 

పిచ్ రిపోర్ట్

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో హైస్కోరింగ్ థ్రిల్లర్ అలరించడం ఖాయం.

గత రికార్డులు

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 7 సార్లు తలపడితే గుజరాత్ 4 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఢిల్లీ 3 మ్యాచ్‌లలో గెలిచింది.

తుది జట్లు అంచనా

ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (కీపర్), నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వి, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, ఎంగిడి, నటరాజన్

గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, ప్రసిద్ధ కృష్ణ, సిరాజ్, అశోక్ శర్మ