10-08-2025 11:52:57 AM
ఢిల్లీ: విమానంలో అపరిశుభ్రంగా, అసౌకర్యవంతమైన సీటు కేటాయించినందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines)పై ఢిల్లీ వినియోగదారుల హక్కుల ఫోరమ్ రూ. 1.5 లక్షల జరిమానా విధించింది. వివరాలలోకి వెళ్తే... పింకీ అనే ఓ మహిళ ప్రయాణీకురాలు విమానంలో తనకు కేటాయించిన సీటు అపరిశుభ్రంగా ఉందని ఆమె ఆరోపించింది. అజర్‌బైజాన్‌లోని బాకు నుండి ఢిల్లీకి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఈ పరిస్థితి ఎదురైందని, విమానయాన సిబ్బంది ప్రవర్తనతో తాను మానసికంగా బాధపడ్డానని ఆమె ఆరోపించింది. దీంతో సదరు ప్రయాణీకురాలు వినియోగదారుల హక్కుల ఫోరమ్(Consumer Rights Forum)ను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన వినియోగదారుల హక్కుల ఫోరం.. ప్రయాణీకులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించలేదని తేల్చింది. ఇది సేవా లోపం వర్గంలోకి వస్తుందని స్పష్టం చేసింది.
అయితే, సీటు బాగా లేదని సదరు ప్రయాణీకురాలు ఫిర్యాదు చేసిన తర్వాత, ఆమెకు వేరే సీటు కేటాయించారని.. ఆ సీటులో కూర్చొని ఆ ప్రయాణీకురాలు ఢిల్లీకి చేరుకుందని ఇండిగో వివరించింది. టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులకు సరైన సౌకర్యాలు కల్పించడం విమానయాన సంస్థల విధి అని, ఈ విషయంలో ఇండిగో విఫలమైందని వినియోగదారుల హక్కుల ఫోరమ్ తేల్చింది. ఆ ప్రయాణీకురాలు ఎదుర్కొన్న మానసిక వేదనకు, ప్రయాణంలో ఆమె అనుభవించిన అసౌకర్యానికి రూ. 1.5 లక్షల పరిహారం చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల ఫోరమ్ తీర్పు ఇచ్చింది. చట్టపరమైన ఖర్చులుగా మరో రూ. 25,000 చెల్లించాలని కూడా ఆదేశించింది.