గురుకులాల్లో రుచికరమైన భోజనం అందించాలి
జిల్లా కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్,ఆగస్టు 3 (విజయ క్రాంతి) : గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం రంగదాంపల్లి శివారులోని తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
పప్పు పలుచగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసి, ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని వంట సిబ్బందిని హెచ్చరించారు. సాయంత్రం భోజనంలో తప్పని సరిగా గుడ్డు, నెయ్యి అందించాలని, విద్యార్థుల హాజరు ఆధారంగా ఆహార పదార్థాల పంపిణీ జరగాలని ప్రిన్సిపల్కు సూచించారు. అనంతరం స్టోర్రూమ్, వంటగదిని పరిశీలించి పరిశుభ్రత పాటిస్తూ సీజనల్ వ్యాధులు నివారించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.






