10 May, 2026 | 8:46 AM

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయమే

14-03-2025 01:33 AM
  1. స్టాలిన్ అధ్యక్షతన 22న జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతాం
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి) : డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సమిష్టిగా పోరాటం చేస్తే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఈ నెల 22న చెన్నైలో జరిగే సమావేశానికి హాజరుకావాలని తమిళనాడు ప్రతినిధి బృందం గురువారం కేటీఆర్‌ను తెలంగాణ భవన్‌లో కోరింది. ఈ సంద ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జనాభా ఆధారంగా కేంద్రం జరపాలనుకుంటున్న డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్టరాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.

అప్పటి భారత ప్రభుత్వాల సూచనల మేరకు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని గుర్తు చేశారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీ హాజరవుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తామన్నారు. కేటీఆర్‌ను కలిసి వారిలో తమిళ నాడు రాష్ట్ర మంత్రి కేఎన్ నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్ ఎలాంగో తదితరులు ఉన్నారు.