1 April, 2026 | 9:24 PM

జీవో నెంబర్ 81, 85లను పకడ్బందీగా అమలు చేయాలి

01-04-2026 07:44 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): 61 ఏళ్లు నిండిన అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ ఏల) వారసులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని, లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని వీఆర్ఏల వారసుల జేఏసీ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నల్ల బ్యాడ్జీలతో కళ్ళకు గంతలు కట్టుకొని అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన జేఏసీ నాయకులు గతంలో సమస్యల పరిష్కారం కొరకు  81 రోజులు సమ్మె చేసిన వీఆర్ఏల లో 16,500 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరించి నియామక పత్రాలు అందజేసిందన్నారు.

నాటి సమ్మె కాలంలో సమ్మె శిబిరాలను సందర్శించిన అప్పటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం తాము అధికారంలోకి వస్తే వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు 61 ఏళ్లు పైబడిన3,797 మంది  వీఆర్ఏల వారసులలో అర్హులైన వారందరికీ వారి విద్యార్హతలను బట్టి  నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. వారికి బీసీ సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు.