19-12-2025 01:47:16 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, డిసెంబరు 18 (విజయ క్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని సుమారు 12 వేల మంది విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందించనున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న దంత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. బధిర విద్యార్థులకు నిర్వహించిన దంత వైద్య పరీక్షలు, చికిత్స వివరాలను క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, మున్సిపల్ కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స చేయించాలని నిర్ణయించామని అన్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు ఒక ప్రత్యేక క్యాంపు నిర్వహించామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 12 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక క్యాంపుల ద్వారా దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 9 వేల మంది విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయని, 24 మందికి చికిత్స అవసరంగా భావించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందజేశామని తెలిపారు.
స్క్రీనింగ్ పూర్తయ్యాక ఎంత మంది పిల్లలకు చికిత్స అవసరమో గుర్తించి వైద్యం చేయిస్తామని అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్య చికిత్సకు కావలసిన అన్ని సౌకర్యాలు, వైద్య బృందం ఉందని అన్నారు. చికిత్సకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీన, డెంటల్ ప్రత్యేక నిపుణులు రవి ప్రవీణ్, రణధీర్, సాహిత్య, ప్రిన్సిపాల్ కమల పాల్గొన్నారు.