7 August, 2026 | 9:33 PM

చినుకు పడితే చిత్తడే…

07-08-2026 08:28 PM

చండ్రుపట్ల డబుల్ బెడ్‌రూమ్ కాలనీ దుస్థితి

8 ఏళ్లుగా ఇదే సమస్య… ప్రజల ఆవేదన

కల్లూరు,(విజయ క్రాంతి): మండలంలోని చండ్రుపట్ల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ కాలనీల వీధులు దారుణ స్థితికి చేరుకున్నాయి.స్వల్ప వర్షం పడినప్పటికీ వీధులన్నీ బురదమయంగా మారిపోతుండటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని ప్రధాన రహదారిలో వివో కార్యాలయం,పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణానికి వెళ్లే మార్గంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ మార్గం దాటడం కూడా కష్టసాధ్యంగా మారింది.

రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లాలంటే ప్రజలు నానా తిప్పలు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. వీధులు పూర్తిగా బురదమయంగా ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో చిన్నారులను పాఠశాలలకు పంపడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు. అదనంగా నిల్వ నీరు,మురుగు కారణంగా దోమలు, ఈగలు విస్తరించి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలనీ పరిస్థితిని పట్టించుకునే నాధుడే లేరా? అంటూ సుమారు 8 సంవత్సరాలుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి రహదారులను,డ్రైనేజీ వ్యవస్థను తక్షణమే మెరుగుపరచాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.