పెద్దల సభకు నితీశ్
రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జేడీయూ చీఫ్
త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు వెల్లడి
ప్రతిగా తన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేలా ఒప్పందం?
ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి..
సీఎం రేసులో డిప్యూటీ సీఎం చౌదరి, కేంద్రమంత్రి నిత్యానందరాయ్?
పాట్నా, మార్చి 5: బీహార్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుని, రాజ్యసభకు వెళ్తున్న ట్లు స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నట్లు స్పష్టం చేశారు.
అంతకుముందు ఆయన తన ’ఎక్స్’ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘గత రెండు దశాబ్దాలకు పైగా మీరు నాపై ఉంచిన విశ్వాసం, మద్దతు ఎప్పటికప్పుడు కొనసాగుతోంది. అదే బలంతో మేము బీహార్ రాష్ట్రాని కి, అక్కడి ప్రజలకు పూర్తి నిబద్ధతతో సేవ చేశాం. మీ విశ్వాసం, మద్దతు వల్లే బీహార్ ఈరోజు అభివృద్ధి, గౌరవానికి కొత్త ప్రమాణాలను చూపిస్తోంది. ఇందుకు ముందు కూడా మీ అందరికి నేను పలుమార్లు కృతజ్ఞతలు తెలియజేశాను.
నా ప్రజా జీవితం ప్రారంభమైనప్పటి నుంచే బీహార్ అసెంబ్లీలోని ఉభయ సభలకు తోడు పార్లమెంట్‌లోని రెండు సభల్లోనూ సభ్యుడిగా ఉండాలని నా మనసులో ఒక కోరిక ఉండేది. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా కావాలని భావిస్తున్నా ను. మీతోనా ఈ సంబంధం భవిష్యత్తులో కూ డా అలాగే కొనసాగుతుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా సంపూర్ణ సహకారం మార్గదర్శనం ఉంటాయి.’ అని పేర్కొన్నారు.
బీహార్ సీఎం ఎవరు?
నితీశ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండడంతో బీహార్ సీఎం ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా ఎన్డీ ఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీయూ.. ఈ సారి ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీకి అప్పగించనుందని సమాచారం. కుమారుని రాజకీయ భవితవ్యం కోసమే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం పదవి కోసం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సామ్రాట్ చౌదరి, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్న నిత్యానందరాయ్ తీవ్రంగా పోటీ పడుతున్నట్లు సమాచారం.
కాగా, సీఎం పదవిని బీజేపీకి అప్పగించేలా, బదులు గా నితీశ్‌కుమారుడు నిశాంత్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. రాజ్యసభఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక, అంటే మార్చి 16 అనంతరం సీఎం పదవికి నితీష్ రాజీనా మా చేయచ్చని జేడీయూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే నితీశ్‌కుమార్ అనుహ్య నిర్ణయాన్ని జీర్ణించుకోలే ని పార్టీశ్రేణులు గురువారం ఆయన నివాసం ముందు నిరసన తెలిపారు.




