వర్షంలోనూ పారిశుధ్య పనుల్లో ఉపసర్పంచ్
మల్టీపర్పస్ వర్కర్లతో కలిసి మొక్కల సంరక్షణ
ప్రశంసలు అందుకుంటున్న పొక్కుల రవి
బూర్గంపాడు,(విజయక్రాంతి): వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుధ్య పనుల్లో మల్టీపర్పస్ వర్కర్లతో కలిసి పనిచేసిన మొరంపల్లి బంజర ఉపసర్పంచ్ పొక్కుల రవి స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు.వర్షం కురుస్తున్న సమయంలో రహదారి డివైడర్ మధ్యలో నాటిన మొక్కల చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మల్టీపర్పస్ వర్కర్లు తొలగిస్తుండగా, ఉపసర్పంచ్ పొక్కుల రవి స్వయంగా వారితో కలిసి పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షంలోనూ పనులు కొనసాగిస్తూ ప్రజా సేవలో తన బాధ్యతను నిర్వర్తించారు.సాధారణంగా ప్రచారం కోసం ఫొటోలకు మాత్రమే పరిమితమయ్యే నాయకులకు భిన్నంగా, క్షేత్రస్థాయిలో కార్మికులతో కలిసి పనిచేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఇలాంటి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు.






