11 June, 2026 | 1:27 AM

‘సిద్ధాపూర్’కు మరో 200 కోట్లు

11-06-2026 12:44 AM
  1. నిజాంసాగర్, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు పూడికతీత
  2. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరలో పునరుద్ధరిస్తాం
  3. కాలువ కట్టలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

బాన్సువాడ, జూన్ 10 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు సవరించిన అంచనాల మేరకు మరో రూ.200 కోట్లు చేయనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నింటినీ త్వరలో పూర్తిచేసి మహర్దశ కల్పిస్తామని స్పష్టం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను బుధవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సురేష్ శెట్కార్‌లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రిజర్వాయర్‌కు సంబంధించిన వివరా లతో ఏర్పాటు చేసిన పొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. రూ.106 కోట్లతో వ్యయంతో చేపట్టిన, 7,975 ఎకరాల ఆయకట్టుకు నీరందించే జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. జాకోరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి, పౌర సరఫరాలకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తోందని గుర్తుచేశారు.

భూసేకరణ, అటవీ అనుమతు లు, ఆర్‌అండ్‌ఆర్ తదితర వాటి కోసం ప్రభుత్వం రూ. 5వేల కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యామ్ లు, కడెం ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించేందుకు పూడికతీత చేపడుతున్నామని తెలిపారు.

అదే తరహాలో నిజామా బాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్, ఉత్తర తెలంగాణ జిల్లాలకు అత్యంత కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో కూడా పూడికతీత చేపట్టి రిజర్వాయర్ల నిల్వసామర్థ్యం పెంపొందిస్తామని ప్రకటిం చారు. కాలువ కట్టలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తెస్తామన్నారు.

సిద్ధా పూర్ రిజర్వాయర్ పనుల పూర్తికోసం సవరించిన ప్రతిపాదనల మేరకు మరో రూ.200 కోట్ల నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లు కలుపుకుని 295 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. అందులో ప్రభు త్వ పరంగా 145 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని, 48గంటల లోపే రైతుల ఖాతాల్లో రూ.35వేల కోట్ల్ల బిల్లులు జమచేశామ న్నారు. 

లిఫ్ట్ పనులు సకాలంలో పూర్తవ్వాలి

చింతలపాలెం/పాలకీడు/కోదాడ(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని లిఫ్ట్ ఇరిగేషన్ పనులు సకాలంలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధ వారం హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని లిఫ్టు ఇరిగేషన్ పనులను పరిశీలించి మాట్లా డారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యానికి తావులేకుండా అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయం తో పనిచేయాలని ఆదేశించారు.

చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరు వద్ద కృష్ణానది మీద నిర్మిస్తున్న మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాం కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 9 గ్రామాలలో 53 వేల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. నవంబర్ లోపు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. అనంతరం పాలకీడు మండలంలోని కృష్ణానదిపై 650 కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. కోదాడలోని రాజీవ్ గాంధీ రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను ఆగస్టు నాటికి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనిఅధికారులను ఆదేశించారు.