రోడ్డు పనులు షురూ
మహబూబాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నుండి డిగ్రీ కళాశాల వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభించడంతో వాహనదారులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చాలాకాలం క్రితం మహబూబాబాద్ కేసముద్రం ఆర్ అండ్ బి రోడ్డు లో ఆర్టీసీ బస్టాండ్ నుండి పిఎస్‌ఆర్ గార్డెన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణ కోసం ఇరువైపులా షాపులను ఇతర ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వెనక్కి జరిపించారు. అనంతరం పనులు ప్రారంభించి డ్రైనేజీ కొంత మేర నిర్మించారు. అయితే ఆ తర్వాత పనులు నిలిపివేయడం, కొంతమేర కంకర వేయడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.
దీనితో ఇటీవల కాలంలో రహదారి దుస్థితిపై వివిధ సంఘా లు, ప్రతిపక్ష పార్టీల నేతలు మున్సిపాలిటీ, ఆర్ అండ్ బి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీనితో స్పందించిన అధికారులు ఎట్టకేలకు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. అయితే వర్షాకాలానికి కొద్ది రోజుల ముందు పనులు చేపట్టడం వల్ల మళ్ళీ పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని, యుద్ధ ప్రాతిపదికన వర్షాలు కురవకముందే రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.






