16 July, 2026 | 5:36 PM

ముందుగానే దేవర?

13-06-2024 03:52 AM

సమయం కాస్త అటుఇటయినా అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇవ్వడానికి తపిస్తున్నారు ఎన్టీఆర్. మరోవైపు ఆయన్ని ఎప్పుడెప్పుడు తెర మీద చూద్దామా అని రెండేళ్ళుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో వారి నిరీక్షణ కొంతవరకు తగ్గనున్నట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘దేవర’ చిత్రాన్ని అక్టోబరు 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఏప్రిల్ 5 అనుకున్నా, ప్రతినాయకుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడటంతో సినిమా వాయిదా పడింది.

తాజాగా ఈ సినిమా మరో విడుదల తేదీని ఖాయం చేసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు 27న ‘దేవర’ తొలి భాగం ప్రేక్షకుల ముంగిటకు రానుందట. ఇదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ తెరమీదికి రావాల్సి ఉంది. అయితే జరగాల్సి ఉన్న చిత్రీకరణ సహా పలు ఇతర కారణాలతో ఆ సినిమా ఈ డేట్ నుండి వదులుకోనుందట. దాంతో ఆ స్థానంలో ‘దేవర’ను తీసుకొచ్చేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా రెండు వారాలా ముందే దేవర చిత్రం విడుదల కానుంది. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర రెండు కోణాల్లో సాగనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణంలో రానున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.