16 July, 2026 | 5:55 PM

నేపథ్య సంగీతమే కథ చెప్తుంది

13-06-2024 03:45 AM

భారతీయ సినిమాలతో ప్రేమలో పడటంతో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి బ్రేకప్ చెప్పేసి, ఇండియా విమానం ఎక్కేశారు దర్శకుడు ప్రకాశ్ దంతులూరి. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘యేవమ్’. ఈ నెల 14న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ...

  1. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నా కెరీర్ ప్రారంభమైంది. ఓ టైమ్‌లో హిందీలో ‘లగాన్’,  తెలుగులో ‘ఖుషి’ సినిమాలు నేను దర్శకుడిగా మారడానికి ప్రేరేపించాయి. అందుకే యూఎస్‌లో జాబ్‌కు రిజైన్ చేసి ఇండియా వచ్చాను. ఆ సమయంలో నేను రాసుకున్న ఓ కథను ప్రియాంకా దత్‌కు వినిపించాను. అశ్వనీదత్ కూడా కథ విని నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చారు. వైజయంతీ మూవీస్‌లో ‘ఓం శాంతి’ నా తొలి సినిమా. ఆ తర్వాత వ్యాపారాల్లో బిజీగా అవ్వడం వల్ల గ్యాప్ తీసుకున్నాను. కోవిడ్ టైంలో మళ్లీ సినిమా చేయాలన్న ఆలోచన కలిగింది. అనుకోకుండా నవదీప్‌ను కలవడం, ఆయనకు కాన్సెఫ్ట్ నచ్చటంతో ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 
  2. ‘యేవమ్’ ఓ సంస్కృత పదం. ఇతిహాసాలు, పురాణాలు చెప్పినప్పుడు ‘ఇది ఇలా జరిగింది’ అని చెప్పడానికి ‘యేవమ్’ అంటారు. ఈ సినిమాలోని పాత్రలు రియల్ లైఫ్ పాత్రల్లా ఉంటాయి. నలుగురు విభిన్నమైన వ్యక్తుల కథ ఇది. వంశీ ‘అన్వేషణ’ లాంటి థ్రిల్లర్‌ను మనకు తెలిసిన పాత్రలతో చెబితే ఎలా ఉంటుందో ‘యేవమ్’ అలా ఉంటుంది. చాలా మందికి అర్థం తెలియదని తెలిసినా, ఈ సినిమాకి తగిన టైటిల్ ఇదే అని అనుకన్నాం. సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.  
  3. ఇది పోలీస్ ఆఫీసర్ కథే అయినప్పటికీ చాలా వినోదాత్మకమైన థ్రిల్లర్. ఈ సినిమాలోని ప్రతి పాత్రా యూనిక్‌గా ఉంటుంది. నేటి సమాజంలోని వ్యక్తులను నేను స్వయంగా గమనించి, వారిని చూసి రాసుకున్న పాత్రలే ఇవన్నీ. సమాజంలోని పాత్రలు, నా మైండ్‌లో రిజిస్టర్ అయిన పాత్రల్లోంచి వచ్చిందే మా ‘యేవమ్’ సినిమా.  జీవితంలో ప్రతి ఒక్కరికీ లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవాలని పరితపిస్తుంటారు. ఓ అమ్మాయి అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకుందనేది ఈ సినిమాలో ఎంతో ఆస్తకికరంగా ఉంటుంది. ఈ సినిమాలో పాత్రల గురించి చెబితే కథ తెలిసిపోతుంది. అందుకే పూర్తిగా చెప్పలేం. కానీ క్యారెక్టర్స్‌ను ఒక పోస్టర్ ద్వారా వాళ్ల పాత్రలను తెలియజేశాం. ఇంతకంటే ఎక్కువ చెబితే క్యారెక్టర్‌లోని కిక్ పోతుంది. చాందిని చౌదరి సౌమ్య పాత్రలో లీనమైపోయింది. ప్రతి సన్నివేశం బాగా చేసింది. ఆమెకు నటిగా మంచి పేరును తీసుకవస్తుంది. 
  4. నేపథ్య సంగీతం కథను చెప్పాలి. కథను ఇబ్బంది పెట్టకూడదు. ఈ సినిమాకు కీర్తనా శేష్ అనే మహిళా సంగీత దర్శకురాలు నేపథ్య సంగీతం అందించారు. నేపథ్య సంగీతమే కథలోని ఎమోషన్స్‌ను చెప్తుంది. టెక్నికల్‌గా కూడా థియేట్రికల్  ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ సినిమా తీశాం. ఇది థియేటర్‌లో చూడదగ్గ సినిమా. థియేటర్‌లో చూసిన ఫీల్ ఓటీటీలో రాదు.